2021 లో తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో ఇప్పుడే అక్కడ ఎన్నికల వేడి మొదలైంది. ఇందులో భాగంగానే మక్కల్ నీది మయ్యం అధినేత ప్రముఖ నటుడు కమల్ హాసన్.. అప్పుడే ప్రజలను ఆకర్షించే విధంగా హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు పొందుపర్చారు.
తన పార్టీ ప్రతిష్టాత్మక ఏడు పాయింట్ల పాలన, ఆర్థిక ఎజెండాను కమల్ ఇందులో పొందుపర్చారు. అందులో ప్రధానమైనది ఇంట్లో పని చేసే మహిళలకు వేతనం ఇస్తామనే హామీ. కుటుంబం కోసం ఇళ్లల్లో శ్రమిస్తున్న గృహిణులకు ప్రత్యేకంగా జీతాలు ఇస్తామని కమల్ హాసన్ హామీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఎన్నికల్లో గెలవాలంటే మహిళల ఓట్లే కీలకమని భావించిన కమల్ హాసన్… వారిని ఆకర్షించేందుకు ఈ రకమైన హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ నిర్వహణ ఆర్థిక ఎజెండా పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏడు అంశాల్ని పొందుపరిచారు. తమిళ సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను రాజకీయాల్లో వచ్చానన్న కమల్ హాసన్.. తాను అధికారంలోకి వస్తే ఏయే వర్గాలకు ఏమేమి చేయనున్నారో తెలిపారు.