లోక నాయకుడు హీరో కమల్ హాసన్ గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. తన యాక్టింగ్ తో ఆడియన్స్ కు దశావతారం చూపిస్తున్న లోకనాయకుడు. భారతదేశంలో పుట్టిన ఆస్కార్ స్థాయి నటుడు. ప్రస్తుతం ఈయన మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈయన అన్నాడీఎంకే, డీఎంకే తరుపన కాకుండా తృతీయ ప్రత్యామ్నాయంగా ఎన్నికల్లో బరిలో దిగారు. తాజాగా జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన కోయంబత్తూర్ (దక్షిణం) నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. అంతేకాదు తాజాగా ఈయన సోమవారం అక్కడి నుంచి తన ఎన్నికల నామినేషన్ దాఖలు చేసారు.
ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ. 176.93 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నాడు. అందులో స్థిరాస్తులు రూ. 131.84 కోట్లు.. చరాస్థులు రూ. 45.09 కోట్లుగా తెలిపారు. ఇక లండన్‌లో రూ. 2.50 విలువ చేసే ఇల్లు.. రూ. 2.7 కోట్ల లగ్జరీ కారు.. రూ. కోటి విలువైన బీఎండబ్యూ కారు ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు తనకు రూ. 49.5 కోట్ల అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక విద్యార్హత 8వ తరగతి చదువుకున్నట్టు తెలిపారు.
కమల్ హాసన్.. 2018 ఫిబ్రవరిలో ఈయన ‘మక్కల్ నీది మయ్యం’ అనే రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసాడు. కానీ ఈయన పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇపుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఈ సారైనా కమల్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.