భారత గడ్డ పై అడుగు పెట్టిన యుద్ధ కమాండర్ అభినంద్

ఇండియన్ పైలెట్ కమాండర్ అభినందన్ భారత్ చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద పాక్ అధికారులు అభినందన్ ను భారత్ కు అప్పగించారు. దీనికి మధ్యవర్తిగా రెడ్ క్రాస్ సంస్థ బాధ్యత వహించింది. అభినందన్ భారత్ లో అడుగుపెట్టగానే భారత్ మాతాకీ జై, వందేమాతరం, ఇండియా జిందాబాద్, అభినందన్ జిందాబాద్ అంటూ ప్రజలు నినదించారు. ప్రజల నినాదాలతో అక్కడి ప్రాంతమంతా మార్మోగిపోయింది.

ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ కురియన్ బృందం అభినందన్ కు ఘన స్వాగతం పలికింది. దీంతో అక్కడ ఒక్క సారిగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఐదుగురు ఐఏఎఫ్ అధికారులు అభినందన్ ను రిసీవ్ చేసుకున్నారు. వాఘా నుంచి అమృత్ సర్ కు చేరుకొని మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రజలందరి కరతాళ ధ్వనుల మధ్య అభినందన్ భారత గడ్డ పై అడుగు పెట్టారు. అభినందన్ భారత గడ్డ పై అడుగు పెట్టడంతో అంతా హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఓ పెద్ద ఉత్కంఠకు తెరపడింది. పాక్ విమానాలను తరిమే క్రమంలో మిగ్ 21 కుప్పకూలి అభినంద్ బుధవారం ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పడిన విషయం తెలిసిందే. 

అభినందన్ కు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి పై పూర్తి స్థాయి ఫిట్ నెస్ ను అధికారులు చెక్ చేయనున్నారు. అదే విధంగా పాక్ అభినంద్ శరీరంలో ఏమైనా నిఘా వస్తువులు పెట్టిందా అనే అనుమానంతో కూడా అధికారులు అభినంద్ ను చెక్ చేయనున్నారు.  అమృత్ సర్  నుంచి అతనిని ఎయిర్ ఫోర్స్ విమానంలో ఢిల్లీకి తీసుకురానున్నారు.  

అభినంద్ ను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత వారి కుటుంబానికి అభినంద్ ను అప్పగించనున్నారని తెలుస్తోంది. అభినందన్ ను “రా” అధికారులు కూడా విచారించనున్నారు. పాక్ అధికారులు ఏం ప్రశ్నించారు. నీవేమి సమాధానం చెప్పావనే కోణంలో అతనిని విచారించే అవకాశం ఉంది.