జమ్ము కశ్మీర్‌తో పెట్రేగుతున్న ఉగ్రవాదంపై భారత సైన్యం తీవ్రస్థాయిలో స్పందించింది. ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్న కశ్మీరీ యువతకు ఇవాళ గట్టి సందేశం ఇచ్చింది. ఇకపై ఆయుధంతో ఎవరు కనిపించినా కనికరం లేకుండా కాల్చిపారేస్తామని హెచ్చరించింది. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులను భారత సైన్యం హతమార్చిన నేపథ్యంలో సైనికాధికారులు ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
‘‘పుల్వామా ఉగ్రదాడి జరిగిన 100 గంటల లోపే దీనికి కారణమైన జైషే మహ్మద్ నాయకత్వాన్ని మట్టుబెట్టాం. పాకిస్తాన్ నేతృత్వంలోనే కశ్మీర్‌లోయలో జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కశ్మీర్‌లో ఇకపై చట్టవిరుద్ధంగా ఎవరు ఆయుధాలతో కనిపించినా కాల్చిపారేస్తాం. ఈ విషయంలో ఏమాత్రం కనికరం చూపించేది లేదు..’’ అని 15 కార్ప్స్ కమాండర్ కన్వాల్ జీత్ సింగ్ దిల్లాన్ హెచ్చరించారు.
ఉగ్రవాదుల్లో చేరిన యువతను వారి కుటుంబ సభ్యులు వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఉగ్రవాదులంతా వెంటనే లొంగిపోవాలనీ.. లేకుంటే సైన్యం చేతుల్లో మరణించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు తమకు ఇంతకు మించి వేరే మార్గం లేదని దిల్లాన్ పేర్కొన్నారు.
ఈనెల 14న పుల్వామాలో చోటుచేసుకున్న కారుబాంబు వంటి దాడి కశ్మీర్‌లో చాలా కాలం తర్వాత జరిగిందనీ.. ఇలాంటి దాడులను సమర్థంగా ఎదుర్కునేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నామని దిల్లాన్ న్నారు. ఈ దాడికి కుట్రపన్నిన సూత్రధారి జైషే కమాండర్ ఘాజీని ఇప్పటికే మట్టుబెట్టామనీ ఉగ్రవాదులు కమ్రాన్, హిలాల్‌ను కూడా సైన్యం హతమార్చిందని ఆయన గుర్తు చేశారు. పుల్వామా దాడిలో ఉపయోగించిన పేలుడు పదార్థాలపై తమకు స్పష్టమైన సమాచారం ఉందనీ.. అయితే దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున వాటిని వెల్లడించలేమని దిల్లాన్ పేర్కొన్నారు.