జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాది ఆత్మాహుతి దాడితో 40 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్థాన్ పిరికి పంద చర్యను దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తోంది. దొంగ దెబ్బకు గట్టిగా బుద్ది చెప్పాలని నినదిస్తోంది. అయితే ఈ దుర్ఘటనలో బీహార్ లోని బగల్ పురాకు చెందిన రతన్ ఠాకూర్ అనే జవాన్ అమరుడయ్యాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగి పోయింది. ఇంతటి బాధలో కూడా ఆ జవాన్ తండ్రి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి.
“మాతృభూమి సేవలో పెద్ద కొడుకును కోల్పోయాను. ఇప్పుడు నా రెండో కొడుకును కూడా సరిహద్దుల్లో పోరాటానికి పంపుతాను. మాతృభూమి కోసం వాడిని త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నాను. కానీ పాకిస్థాన్ కు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే” అని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు.
మరోవైపు జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఎన్ఐఏ బృందం కూడా కశ్మీర్ చేరుకొని విచారణ ప్రారంభించింది. దుర్ఘటనకు బాధ్యత వహిస్తున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ప్రపంచ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.