పుల్వామా ఉగ్ర దాడి ఘటన అనంతరం పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ మరో భారీ దాడికి వ్యూహం పన్నిందా ? అంటే అవునంటున్నాయి కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు. పుల్వామా దాడి అనంతరం ఈ నెల 16, 17 తేదీల్లో పాకిస్థాన్ దేశంలోని జైషే మహ్మద్ నాయకులు, కశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులతో సంభాషించారు.
ఆ సంభాషణలో జమ్మూ నగరం లేదా జమ్మూ కశ్మీర్ బయటి ప్రాంతంలో ఒకచోట మన జవాన్లపై భారీ దాడి చేయాలని వ్యూహం పన్నినట్లు ఇంటలిజెన్స్ కు సమాచారం అందింది. దీంతో ఇంటలిజెన్స్ అధికారులు మన భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.
పుల్వామా దాడి ఘటన ఏర్పాట్ల గురించి జైషే మహ్మద్ విడుదల చేసిన వీడియోలో కొందరు కశ్మీరీ యువకులను ఆత్మాహుతి బాంబర్లుగా మార్చారని వెల్లడైంది. జైషే మహ్మద్ మాజీ కమాండర్ ముహ్మద్ వకాస్ దార్ రాజౌరిలోని నౌషెరా వద్ద ఎల్ఈడీ బాంబు పెట్టాడు. ఆ బాంబు కాస్తా పేలి గతవారం ఆర్మీ మేజర్ ఛిత్రేష్ బిష్ట్ మరణించారు.
కశ్మీర్ లోయలోని ఉగ్రవాదులు పాక్ తీవ్రవాద నాయకులతో ఫోన్ లో మంతనాలు జరిపిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటలిజెన్స్ హెచ్చరికలతో జమ్మూతోపాటు ఇతర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.