విపక్షాలపై ఎదురుదాడి ఎలాగైనా చేసెయ్యొచ్చని అధికార వైసీపీ అనుకుంటే అది పొరపాటే. ఎక్కువ కాలం అవే తరహా ఎదురుదాడి వ్యవహారాలు అధికార పార్టీకి ఏమాత్రం కలిసిరావు. ‘ఏం.. మేం మాత్రమే అప్పులు చేస్తున్నామా.? చంద్రబాబు హయాంలో అప్పులు జరగలేదా.?’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అస్సలేమాత్రం సమర్థనీయం కావు. అప్పులెందుకు చేస్తున్నారన్నదానిపై జగన్ సర్కారు వద్ద ఖచ్చితమైన సమాచారం వుండి వుండొచ్చుగాక. కరోనా నేపథ్యంలో అప్పులు చేయడమూ తప్పు కాకపోవచ్చుగాక. కానీ, రెండేళ్ళ తర్వాత కూడా ఇంకా పాత ప్రభుత్వంపై విమర్శలు చేయడం, అవసరం వున్నా లేకపోయినా.. టీడీపీ పాలనను ప్రస్తావించడం ద్వారా, టీడీపీకి అదనపు మైలేజ్ ఇచ్చినట్లవుతుందన్న వాస్తవాన్ని వైసీపీ అధినాయకత్వం గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వున్న అప్పులు.. రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు కావు.
ప్రజలకు సంబంధించినవి. అధికారంలో ఎవరున్నా ఈ విషయమై మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నిజమే, అప్పులు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ అప్పులు చేసే క్రమంలో కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని రాష్ట్రంలోని పాలకులు, ఎందుకు రాబట్టలేకపోతున్నారు.? ఎందుకీ అసమర్థత.? అన్న చర్చ ఖచ్చితంగా తెరపైకొస్తుంది. పోలవరం ప్రాజెక్టు.. జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వమెందుకు ముందస్తు ఖర్చు చేసేసి, కేంద్రాన్ని ‘రీ-ఎంబర్స్’ చేయండంటూ దేబిరించాలి.? ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో కేంద్రాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం నిలదీయలేకపోతోంది. రాష్ట్ర ఆర్థిక లోటుపై కేంద్రాన్ని అస్సలు ప్రశ్నించడంలేదు వైసీపీ. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ బీజేపీ ఆటలిలాగే సాగాయి. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలోనూ అదే జరుగుతోంది. అంటే, 2024 ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి కూడా, 2019 ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిలానే వుండబోతోందా.? అదే జరిగితే, వైసీపీకి పెను గండమే అది రాజకీయంగా.