సువిధ రైళ్లు, డైనమిక్ ప్రైసింగ్…. ఈ పేర్లు వింటేనే రైలు టికెట్ కోసం ప్రయత్నించేవారి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఒక్కో టికెట్ బుక్ అవుతున్న కొద్దీ, వీటిలో ప్రయాణ చార్జీ విమానాల టికెట్ ధరలా పెరిగిపోతుంది. నిమిష నిమిషానికి ఆకాశాన్ని తాకుతుంది. ఈ తరహా ధరల విధానంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోనున్న ఎన్డీయే సర్కారు ఓ మెట్టు దిగివచ్చింది.
డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని తొలగించనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ మేరకు సూత్రప్రాయంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. సువిధ రైళ్ల స్థానంలోనే సాధారణ ప్రత్యేక రైళ్లు నడిపించాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
కాగా, గడచిన సంక్రాంతి సీజన్ లో తెలుగు రాష్ట్రాల్లో సువిధ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించగా, సాధారణ టికెట్ తో పోలిస్తే నాలుగు రెట్ల వరకూ అదనపు చార్జీలను ప్రయాణికులు చెల్లించాల్సి వచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి, పీయూష్ గోయల్ తో చర్చించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ప్రకటించి, రిజర్వేషన్ జరుగుతున్న సువిధ రైళ్లు మినహా కొత్త రైళ్లను ప్రకటించరాదని కేంద్రం నిర్ణయించింది.