Railway: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. స్లీపర్, ఏసీ టికెట్ ధరలు పెంపు.. ఎంతంటే..?

రైళ్లలో ప్రయాణం అంటే ఇప్పటివరకు సామాన్యుడికి అందుబాటులో ఉండే సౌకర్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు దూర ప్రయాణాలు చేసే వారికి ఇది కొంత భారంగా మారనుంది. భారతీయ రైల్వే ఈ నెల 26 నుంచి టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులపై ఈ ప్రభావం పడనుండగా, తక్కువ దూరం ప్రయాణించే వారికి మాత్రం ఊరట లభించనుంది.

రైల్వే నిర్ణయం ప్రకారం 215 కిలోమీటర్ల వరకు జనరల్ క్లాస్ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. కానీ ఆ దూరాన్ని దాటిన ప్రయాణాలకు మాత్రం కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున అదనపు చార్జీ వసూలు చేయనున్నారు. దీంతో దీర్ఘదూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు కొంత ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. మైల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఎయిర్ కండీషన్డ్ కోచుల్లో ప్రయాణించే వారికి కిలోమీటర్‌కు 2 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఎయిర్ కండీషన్డ్ కోచుల్లో ప్రయాణిస్తే కూడా కిలోమీటర్‌కు 2 పైసలు పెరుగుతాయి. ఉదాహరణకు, 500 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే నాన్-ఎయిర్ కండీషన్డ్ కోచ్‌లో ఇప్పటివరకు కంటే సుమారు రూ.10 ఎక్కువ ఖర్చవుతుంది.

టికెట్ ధరల పెంపుపై రైల్వే శాఖ స్పందిస్తూ, గత పదేళ్లలో తమ ఆపరేషన్లు, రైలు నెట్‌వర్క్ గణనీయంగా విస్తరించాయని పేర్కొంది. ఈ తాజా ధరల సవరణ వల్ల రైల్వే వార్షిక ఆదాయం సుమారు రూ.600 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేసింది. ఈ నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవల మెరుగుదలకు వినియోగిస్తామని అధికారులు తెలిపారు.

ఇక ఖర్చుల విషయానికి వస్తే, రైల్వే సంస్థపై భారీ భారం ఉందని వెల్లడించింది. ఉద్యోగుల జీతాలు, బోనసులు, పింఛన్లు, ఇతర సేవా వ్యయాలు కలిపి మొత్తం వ్యయం రూ.1,15,000 కోట్లకు చేరిందని వివరించింది. అందులో పింఛన్ల ఖర్చే సుమారు రూ.60,000 కోట్లుగా ఉందని తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆపరేషన్ ఖర్చు రూ.2,63,000 కోట్లుగా ఉందని పేర్కొంది.

ఈ ఖర్చుల పెరుగుదల నేపథ్యంలో ఆదాయాన్ని సమతుల్యం చేసేందుకు రైల్వే స్మార్ట్ కార్గో లోడింగ్ పెంచడంతో పాటు, ప్రయాణికుల టికెట్ ధరల్లో స్వల్ప పెంపుపై దృష్టి పెట్టినట్లు స్పష్టం చేసింది. ఇదే సమయంలో రైల్వే గతంలో కూడా దశలవారీగా టికెట్ ధరలను పెంచిన విషయాన్ని గుర్తు చేసింది. 2020 జనవరి 1న, అలాగే గత ఆగస్టులోనూ టికెట్ చార్జీల్లో మార్పులు చేశామని వివరించింది. మొత్తానికి, తక్కువ దూర ప్రయాణికులకు ఊరట లభించినప్పటికీ, ఉద్యోగం లేదా ఇతర అవసరాల కోసం తరచూ దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఇకపై ప్రయాణ ఖర్చులను ముందుగానే లెక్కలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.