శబరిమల ఆలయ సంప్రదాయానికి భిన్నంగా ముగ్గురు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఘటన రగిల్చిన కార్చిచ్చుఇంకా చల్లారనే లేదు. కేరళలో శాంతిభద్రతలు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు. అప్పుడే మరో ఆజ్యానికి తెర తీసింది అక్కడి ప్రభుత్వం. ఏకంగా విదేశీ మహిళలను కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి అనుమతి ఇచ్చింది.
విదేశీ మహిళలు కూడా శబరిమల ఆలయాన్ని సందర్శించుకోవచ్చని కేరళ పర్యాటక, దేవస్వోమ్ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. వారికి కొన్నిఆంక్షలు ఉంటాయని చెప్పారు. విదేశీ మహిళలకు సాధారణ దర్శనాన్ని మాత్రమే కల్పిస్తామని అన్నారు. 18 మెట్లు ఎక్కకుండా నిషేధిస్తామని అన్నారు. ఇరుముడి కట్టుకుని వస్తేనే 18 మెట్లు ఎక్కనిస్తామని అన్నారు. అయ్యప్ప మాల ధరించని వారికి మకరజ్యోతి దర్శనం అనంతరమే విదేశీ మహిళలకు అనుమతి ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో స్వీడన్‌కు చెందిన ఇద్దరు మహిళ శబరిమలకు చేరుకోవడానికి సన్నద్ధురాలయ్యారు. పోలీసుల అనుమతి తీసుకోవడానికి ఆమె నీలక్కళ్‌కు చేరుకున్నారు. నీలక్కళ్ అత్యంత సున్నిత ప్రాంతం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత నీలక్కళ్ వద్దే పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వారు సుమారు రెండు గంటల తరువాత వెనక్కి మళ్లారు.