మనిషికి ఎన్ని కోట్లున్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే జీవితమే వృథా అని పెద్దలు అన్నారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని చెప్పారు. అయితే కుటుంబ పెద్దలకు వచ్చిన రోగంతో అంతా కుంగిపోయారు. దీంతో ఏకంగా కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కరుమత్తిపట్టి పరిధి అమలి నగర్ లో ఆంథోని ఆరోగ్య రాజ్ తన అత్త, భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. గత కొంత కాలంగా తల్లితో పాటు భార్య భర్తలు కూడా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. డాక్టర్లకు చూపించినా వారికి నయం కాలేదు. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో వారు బాధపడ్డట్టు తెలుస్తోంది. అయితే ఏ రోగం లేకుండానే ఇలా ఎందుకవుతుందని వారు మానసికంగా కుంగిపోయారు. ఇక బతకవద్దని నిర్ణయించుకున్నారు. ముందుగా అంథోని రాజ్ భార్యపిల్లలకు, తల్లికి విషమిచ్చాడు. వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక తను ఫ్యాన్ కు ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారి ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వారి ఇంటి తలుపులు పగులకొట్టి చూశారు. దీంతో దారుణం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. ఆరోగ్యరాజ్ రాసిన సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఆ లేఖలో తమ చావుకు ఎవరూ కారణం కాదని, అనారోగ్య సమస్యలతో తాము ఆత్మహత్యకు పాల్పడినట్టు రాశాడు. పిల్లలు అనాథలు కాకూడదని పిల్లలను కూడా చంపానని ఆ లేఖలో ఉంది. ఈ విషాద ఘటన చూసి స్థానికులు కంటతడి పెట్టారు. మానసికంగా కుంగిపోయి కుటుంబం మొత్తం చనిపోవడం అందరిని కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.