దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఫోన్ కాల్స్, ఎస్ఎమ్మెస్ లు, ఈ మెయిల్స్… ఏ రూపంలో అయినా సైబర్ నేరగాడు మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో.. అనవసరమైన మెసేజ్ లు ఓపెన్ చేయకండని.. ఓపెన్ చేయకుండానే డిలీట్ చేయమని చెబుతున్నారు పోలీసులు. ఇక బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ అడిగే ఏ ఫోన్ కాల్ నూ కంటిన్యూ చేయొద్దని, వెంటనే కట్ చేయమని సూచిస్తున్నారు. అయితే తాజాగా ఎస్.బి.ఐ ఖాతాదారులను టార్గెట్ చేసి.. యోనో ద్వారా మోసాలకు పాల్పడుతున్నారంట సైబర్ నేరగాళ్లు.
అవును… “ప్రియమైన ఎస్‌బీఐ వినియోదారుడా! మీ ఖాతా బ్లాక్ అవుతుంది. పాన్ నంబరును అప్ డేట్ చేసుకోవడానికి ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి” అంటూ మోసపూరిత మెసెజ్ లు పంపుతూ ఎస్బీఐ వినియోగదారులను సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారని.. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనో నమ్మవద్దని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. పైగా ఇవన్నీ డైరెక్ట్ బ్యాంక్ లోగోతో రావడంతో మెజారిటీ ఖాతాదారులు నమ్ముతున్నారని.. ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలా వచ్చే ఏ ఎస్సెమ్మెస్, ఈ మెయిల్స్ కు ఏమాత్రం స్పందించొద్దని… ఏదైనా సమాచారం కావాలంటే బ్రాంచ్ కి వెళ్లి తెలుసుకోవడం ఉత్తమనని సూచిస్తున్నారు.
ఈ విషయంలో మరింత జాగ్రత్తలు చెబుతున్న పోలీసులు… ఫోన్ వచ్చినా, ఎస్సెమ్మెస్ – ఈమెయిల్స్ లలో అడిగినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ – యోనో యాప్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీ సహా ఇతర ఏ సమాచారాన్ని పంపడం కానీ, చెప్పడం కానీ చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు! పొరపాటున ఇప్పటికే ఏదైనా పొరపాటు చేసి ఉంటే.. సైబర్ నేరం గురించి నేరుగా ఫిర్యాదు చేయాలనుకుంటే.. 1930 నంబర్ కు ఫోన్ చేసి చెప్పవచ్చని సూచిస్తున్నారు.