టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వ్యవహారలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. ఇందులో భాగంగా… కబాలి సినిమా నిర్మాత విచారణ పూర్తయిన అనంతరం కొంతమంది సెలబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి. ఇందులో భాగంగా… సుమారు 12 మంది పేర్లు లీక్ అవ్వగా, అందులో అషు రెడ్డి పేరు ప్రముఖంగా తెరపైకొచ్చింది. అయితే ఈ విషయాలపై అషురెడ్డి స్పందించింది.
తనతో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఈ విషయంపై సీరియస్ గా స్పందించింది అషు రెడ్డి. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలు ఆమె ఫోన్ నంబర్ ను కూడా బయటపెట్టడంపై హర్ట్ అయినట్లు చెబుతుంది. తన ఫోన్ నంబర్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టడాన్ని ఎంతమాత్రం సహించనంటూ ఫైరవుతుంది.
ఈ సందర్భంగా… కొంతమందితో తనకున్న అసోసియేషన్ పై కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించిన అషు రెడ్డి.. కొన్ని గంటలుగా తనపై వస్తున్న వార్తల్ని ఖండిస్తున్నానని తెలిపింది. ఇదే సమయంలో అవసరం వస్తే డ్రగ్స్ కేసుకు సంబంధించి చెప్పాల్సిన నిజాలను సంబంధిత అధికారులకు చెబుతానని వెల్లడించింది.
శుక్రవారంతో కేపీ చౌదరి రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసిన సంగతి తెలిసిందే. విచారణ ముగిసిన వెంటనే అషు రెడ్డి పేరు తెరపైకొచ్చింది. ఆమెతో కేపీ చౌదరి వందల కాల్స్ మాట్లాడినట్టు వార్తలొచ్చాయి. ఆ సంగతి అలాఉంటే… ఈ కేసుపై పూర్తిస్థాయిలో ఛార్జ్ షీట్ తయారుచేసే పనిలో పడ్డారు పోలీసులు. ఛార్జ్ షీట్ సిద్ధమైన తర్వాత కొంతమంది ప్రముఖులకు నోటీసులు పంపించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
కాగా… ఈ నెల 14న డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్టయ్యాక పోలీసులు ఆధారాలు సేకరించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా తనవద్ద నుంచి కొకైన్ కొనుగోలు చేసిన వారి జాబితా గూగుల్ డ్రైవ్ లో ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు. దీంతో దాన్ని డీకోడ్ చేయగా… వారి వివరాలు ఫొటోలతో సహా బయటపడ్డాయని తెలుస్తుంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 మంది సినీ, టీవీ నటీనటులు, మోడల్స్, వ్యాపారులు ఉన్నారని సమాచారం.