కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీ మిత్రపక్షంగా ఉంది. రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రధానిని ఆలింగనం చేసుకొని కన్ను కొట్టిన ఘటనపై ఆ పార్టీ నేత పలు ఆరోపణలు చేశారు. దానిని సీరియస్ గా తీసుకున్న ఆ పార్టీ అధినాయకత్వం ఆ పార్టీ నేతపై వేటు వేసింది. దాని వివరాలివి
ఆర్జేడి జాతీయ అధికార ప్రతినిధి శంకర్ చరణ్ త్రిపాఠీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై విమర్శలు చేశాడు. రాహుల్ గాంధీ పార్లమెంటులో చిన్నపిల్లాడిలా ప్రవర్తించాడని.. ప్రధానిని కౌగిలించుకోవడం, ఆ తర్వాత కన్నుగీటడం వంటి ప్రవర్తనలతో రాహుల్ చిన్నపిల్లవాడిలా చేష్టలు చేశాడని త్రిపాఠీ ఆరోపించారు. ఎన్డీయే సర్కార్, రక్షణ మంత్రిపై నిరాధార ఆరోపణలు చేశారని త్రిపాఠి వ్యాఖ్యానించారు. రాహుల్ లోక్ సభలో అదరగొట్టాడంటూ ఆర్జేడి నేత తేజస్వీయాదవ్ ట్వీట్ చేసిన రోజే త్రిపాఠీ ఈ ఆరోపణలు చేశారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్రీయ జనతాదళ్ త్రిపాఠిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఎంకీ పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు ఏదో చేయపోతే ఏదో జరిగిందని త్రిపాఠి మదనపడ్డట్టు పలువురు నేతలు చెబుతున్నారు.