విదేశీ పర్యటన అనగానే ఎక్కువ ఖర్చు అన్న టెన్షన్ చాలామందిని వెనక్కి నెట్టి వేస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కొన్ని దేశాలు భారతీయ పౌరులకు తక్కువ బడ్జెట్‌లోనే వీసా సౌలభ్యంతో అద్భుతమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ దేశాలు దూరంగా ఉన్నా, మన జేబు తేలికగా అనిపించేలా అందుబాటు ధరల్లో ప్రయాణం, వసతి, ఆహారాన్ని కల్పిస్తున్నాయి.
థాయ్‌లాండ్ మొదటిది చెప్పుకోవాలి. బ్యాంకాక్ బజార్లు, పటాయా బీచ్‌లు, క్రాబీ శాంతమైన దృశ్యాలు, చియాంగ్ మై సాంస్కృతిక కేంద్రం. ఇలా అన్ని కూడా.. ఇక 30 రోజుల వరకు వీసా అవసరం లేకపోవడంతో ఈ దేశానికి టూర్ ప్లాన్ చేయడం మరింత సులభం. అక్కడి స్ట్రీట్ ఫుడ్, బడ్జెట్ హోటళ్లు భారతీయులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
నేపాల్ మరొక ఉత్తమ ఎంపిక. వీసా అవసరం లేకుండా ఐడీతోనే వెళ్లవచ్చు. ఖాట్మండు, పోఖారాలో అనుభవించదగిన బౌద్ధ సాంప్రదాయం, హిమాలయాల దృశ్యాలు ట్రెక్కింగ్ ప్రియులకు తీపి జ్ఞాపకాలు కలిగిస్తాయి. వసతి, రవాణా, ఫుడ్.. అన్ని కూడా తక్కువ ఖర్చులోనే. 20 వేలు ఉన్నా కూడా టెన్షన్ లేకుండా తిరగవచ్చు. భారతీయులకు స్నేహపూర్వకమైన వాతావరణంతో పాటు మన సంస్కృతికి దగ్గరగా ఉన్న నేపాల్ ఖచ్చితంగా బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్.
భూటాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిమాలయాల్లో వెలసిన ఈ చిన్న దేశం స్థూల జాతీయ సంతోష సూచికతో ప్రసిద్ధి చెందింది. వీసా అవసరం లేదు. అక్కడి ప్రశాంతత, గ్రీన్ లైఫ్‌స్టైల్, తక్కువ రవాణా ఖర్చులు బడ్జెట్ ట్రావెలర్స్‌కు బంగారుమూల్యం.
శ్రీలంక కూడా భారత్‌కు సమీపమైన అందమైన ద్వీపం. వీసా రహితంగా 30 రోజుల వరకు పర్యటనకు అనుమతి. బీచ్‌ల నుంచి పర్వతాలు, చారిత్రక శిధిలాల నుంచి నేషనల్ పార్క్స్ వరకు ఎన్నో రకాల అనుభవాలు తక్కువ ఖర్చుతో ఆస్వాదించవచ్చు. 20 నుంచి 30 వేల బడ్జెట్‌లో ఇతర దేశాలను చూడాలనుకునే వారి కోసం ఇదే సరైన సమయం.