హిమాలయ దేశం నేపాల్ తీవ్ర అశాంతిలో ఉంది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేయాలి, అవినీతి ఆపాలి అంటూ వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం సోషల్ మీడియా యాప్‌లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినా ఆందోళనలు ఆగలేదు. సెప్టెంబర్ 7న మొదలైన ఈ ఉద్యమం సెప్టెంబర్ 8న పార్లమెంట్ వైపు దూసుకెళ్లడంతో పోలీసులతో ఘర్షణలకు దారితీసింది. భద్రతా దళాలు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 19 మంది యువకులు మృతి చెందగా, వందల మందికి గాయాలయ్యాయి. ఈ పరిణామాల తర్వాత హోం మంత్రి, అనంతరం అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం రాజకీయ నేతలు దేశం వదిలి పారిపోయిన పరిస్థితి కనిపించింది.
నిరసనల వేళ నెపో కిడ్స్, పొలిటిషియన్ నెపో బేబీ అంటూ నేపాల్‌లో కొన్ని సోషల్ మీడియాల్లో హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి. దేశంలో నిరుద్యోగం, అవినీతి తాండవిస్తున్నా.. ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నా.. రాజకీయ నేతల పిల్లలు, ధనికులు ఆడంబరమైన జీవితం అనుభవిస్తుండడంతో.. యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాజకీయ నాయకులు పిల్లలు విదేశాల నుంచి గూచి బ్యాగులతో వస్తుంటే.. మిగతా పిల్లలు మాత్రం శవపేటికల్లో వస్తున్నారు అని ఓ నిరసనకారుడు ప్లకార్డు ప్రదర్శించడం పరిస్థితికి అద్దం పడుతోంది. తమ తల్లిదండ్రులు సంపాదించిన అవినీతి సొమ్మును నెపో కిడ్స్ ఆస్వాదిస్తున్నారని కొందరు నిరసనకారులు మండిపడ్డారు.
నిజానికి ఈ నిరసనల వెనుక కేవలం సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కారణమా.. లేదా లోపల, బయట నుంచి మరింత పెద్ద కుట్ర నడుస్తుందా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా ఈ పరిణామాలతో పాటుగా నేపాల్‌లో మళ్లీ రాచరిక పాలనకు మద్దతు గళం వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో రెండు దశాబ్దాల కిందట దేశాన్ని రక్తంతో తడిపిన రాజమహల్ నరమేధం మళ్లీ చర్చలోకి వచ్చింది. 2001లో రాజమహల్‌లో జరిగిన నరమేధం ఆ దేశ చరిత్రలో మరిచిపోలేని అధ్యాయంగా నిలిచింది. మహారాజు బీరేంద్ర బీర్ విక్రమ్ షా దేవ్, మహారాణి ఐశ్వర్య రాజ్యలక్ష్మి దేవి, యువరాజు దీపేంద్ర, చిన్న యువరాజు నిరంజన్, యువరాణి శ్రుతి.. ఇలా ఒకేసారి రాజకుటుంబం దాదాపు మొత్తం అంతరించిపోయిన సంఘటనను గుర్తు చేసుకోవడమే ఇప్పుడు నేపాల్ ప్రజల్లో కలకలం రేపుతోంది.
అది 2001 జూన్ 1వ తేదీ. రాజభవనంలో ఘన విందు జరుగుతోంది. అతిథులతో సరదాగా గడుస్తున్న వేళ ఒక్కసారిగా యువరాజు దీపేంద్ర గది నుంచి బయటకు వచ్చాడు. అయితే ఆయన చేతిలో గన్ ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుగా తన తండ్రి, ఆ తర్వాత తల్లిపై కాల్పులు జరిపాడు. వెంటనే చిన్న యువరాజు, యువరాణి, ఇతర సభ్యులపై కూడా తుపాకీ కాల్చి పడేశాడు. క్షణాల్లో రాయల్ ఫ్యామిలీని సర్వనాశనం చేశాడు. చివరికి తనను తాను కాల్చుకుని కోమాలోకి వెళ్ళాడు. జూన్ 4న మరణించాడు.
దీపేంద్ర ఎందుకు ఈ భయంకర చర్యకు పాల్పడ్డాడు అన్నది అప్పట్నుంచి ఇప్పటికీ చర్చనీయాంశమే. అధికారికంగా చెప్పిన ప్రధాన కారణం.. అతను ప్రేమించిన దేవయాని రాణాతో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడమే అని తెలుస్తోంది. దేవయాని భారతదేశంలోని గ్వాలియర్ రాజకుటుంబానికి బంధువైన సింధియా వంశానికి చెందినది. రాజకీయ, రాజకుటుంబ లెక్కల ప్రకారం ఈ పెళ్లి సరిపడదని మహారాజు, మహారాణి అడ్డుకున్నారు. మరొక వాదన ప్రకారం దేవయాని రాణా కుటుంబం నేపాల్ రాజకుటుంబానికంటే ఉన్నతమైన స్థాయిలో ఉందని.. అలాంటి వివాహం జరిగితే ఆ కుటుంబానికి అవమానం అవుతుందని భావించారట.
ఈ సంఘటన తర్వాత దేశపు పగ్గాలు మహారాజు బీరేంద్ర సోదరుడు గ్యానేంద్ర చేతుల్లోకి వెళ్లాయి. 2008 వరకు ఆయన రాజ్యాన్ని నడిపారు. ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్ని స్వీకరించిన నేపాల్ రాజ్యాంగ సభ ద్వారా రాచరికాన్ని పూర్తిగా రద్దు చేసింది. అయితే ఇప్పుడు జెన్ జీ తరగతి మరోసారి రాచరిక పాలన కోసం ఉద్యమం చేయడం దేశ రాజకీయ దిశను ప్రశ్నార్థకంగా మారుస్తోంది.
ఇటీవల పదవికి రాజీనామా చేసిన నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ కూడా ఈ విషయాన్ని మరింత ఆసక్తికరంగా మలిచారు. రాచరిక పాలనను తిరిగి తీసుకురావాలనే ఈ ఆందోళనల వెనుక మాజీ రాజు గ్యానేంద్ర పాత్ర ఉందని ఆయన బహిరంగంగా ఆరోపించారు. దీని వలన నేపాల్ రాజకీయ వాతావరణం మరింత గందరగోళానికి లోనవుతోంది. రాజమహల్ నరమేధం, యువరాజు దీపేంద్ర ప్రేమ కథ, ఆ తర్వాతి రాజకీయ పరిణామాలు.. ఇవన్నీ మళ్లీ జ్ఞాపకాలను తడిమి, నేటి ఆందోళనలకు కొత్త ఆలోచన రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు రక్తంతో రాసిన ఆ చరిత్ర మళ్లీ ప్రత్యక్షమవుతోంది. మరి నేపాలు రాజకీయాలు ఎటు వైపు వెళ్తాయో చూడాలి.
