Nepal Crisis: హిమాలయ దేశంలో అగ్ని జ్వాలలు.. అసలేం జరుగుతోంది.?

Nepal Crisis

Nepal Crisis: హిమాలయ దేశం నేపాల్‌లో అగ్నిజ్వాలలు రాజుకున్నాయి. సోషల్ మీడియాపై నిషేధంతో అక్కడి యువత ఒక్కసారిగా భగ్గుమంది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రధాని, మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టడంతో సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలను సైతం ఆందోళనకారులు ధ్వంసం చేశారు. యువత ఆందోళనలతో సైన్యం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేపాల్‌లో అల్లకల్లోలం ఏర్పడానికి కారణం ఏంటి..? అందుకు దారితీసిన పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తీవ్ర ఉద్రిక్తతలకు కారణం ఏంటంటే..?

సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడం జెన్ జెడ్ యువత ఆగ్రహానికి కారణమైంది. సోషల్ మీడియా బ్యాన్‌తో ప్రభుత్వం తమకు స్వేచ్ఛ లేకుండా చేస్తుందని మండిపడింది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని సోషల్ మీడియాలో యువత ఉద్యమం ప్రారంభించింది. కొందరు నేతల కుటుంబసభ్యులు విదేశాల్లో అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో యువతలో మరింత ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ప్రభుత్వంలోని నేతలు అవినీతిలో పూర్తిగా కూరుకుపోయారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమం తీవ్రతరం కావడంతో దేశంలో రిజిస్ట్రేషన్ లేదనే సాకుతో సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో జెన్ జెడ్ యువత భగ్గుమంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున దేశమంతా తీవ్ర ఆందోళనలకు దిగింది. ఆందోళనకారులు “కేపీ చోర్, దేశ్ ఛోడ్” అనే నినాదాలతో ప్రధాని ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున యువత చేపట్టిన ఆందోళనలు తీవ్రతరం కావడంతో పోలీసులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడు సహా 19 మంది యువత మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసింది.

nepal crisis

 

పార్లమెంటు, సుప్రీం కోర్టు, ప్రధాని ఇంటికి నిప్పు

సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసినా యువత సహించలేదు. మరింత రెచ్చిపోయారు. అవినీతిలో కూరుకుపోయిన నేతలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎత్తుకున్నారు. ఈ నేపథ్యంలో హింసకు పాల్పడ్డారు. ముఖ్యంగా రాజధాని కాఠ్మూండులో ఆందోళనలతో రెచ్చిపోయారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు, అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. అంతేకాకుండా కొందరు మంత్రులపై దాడులు చేశారు. కర్ఫ్యూ విధించినప్పటికీ రోడ్లపై టైర్లు కాల్చి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీస్‌ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకూ నిప్పు పెట్టారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని జలానథ్ ఖనాల్ ఇంటిపై దాడి చేయడంతో మంటల్లో ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్తరాక్ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన షాక్‌కు గురిచేసింది.

nepal crisis

ప్రధాని ఓలీ రాజీనామా.. సైన్యం చేతిలోకి పాలన

అలాగే మరో మాజీ ప్రధాని పుష్ప కమాల్‌ దహల్‌తో పాటు నేపాలీ కాంగ్రెస్‌ చీఫ్, మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు. అంతేకాకుండా దేవ్‌బా దంతులపై దాడి చేశారు. ఈ దాడిలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్‌ పౌడేల్‌పై కాళ్లతో దాడి చేసిన వీడియో వైరలైంది. పరిస్థితి చేయిదాటిపోవడంతో సైన్యం రంగంలోకి దిగింది. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలి సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. అనంతరం దేశంలో లా అండ్ అర్డర్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ప్రకటించారు. ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయ విమానశ్రయాన్ని మూసివేశారు. ప్రధాని ఓలి రాజీనామా చేయడంతో ఆందోళనకారులు శాంతించాలని సైన్యంతోపాటు ఇతర భద్రతా సంస్థలు , స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రాజ్యాంగాన్ని తిరగరాయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అల్లర్లను నియంత్రించడానికి సైన్యం చర్యలు చేపట్టింది. రాజధాని కాఠ్మండు సహా ఇతర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.

అప్రమత్తమైన భారత ప్రభుత్వం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

నేపాల్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. నేపాల్‌లోని భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితి ఎదురైతే భారత ఎంబసీలోని +977-980 860 2881, +977-981 032 6134 నంబర్లను సంప్రదించాలని సూచించింది. నేపాల్‌కు వెళ్లొద్దని ప్రకటన జారీ చేసింది. మరోవైపు నేపాల్‌లో జరిగిన ఉద్రికత్తలపై ప్రధాని మోదీ స్పందించారు. నేపాల్‌లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు హృదయవిదారకమని పేర్కొన్నారు. ఆందోళనల్లో యువత ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దేశంలోని యువత శాంతి పాటించాలని విజ్ఞప్తి చేశారు.