సీనియ‌ర్ల‌నే న‌మ్ముకున్న రాహుల్‌: ఢిల్లీ కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక పే..ద్ద దిక్కు!

ఢిల్లీ కాంగ్రెస్‌కు అందుబాటులో ఉన్న ఏకైక అతి పెద్ద దిక్కు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌వి చూసిన తరువాత ఆమె క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు కాస్త దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను కూడా కాంగ్రెస్ షీలా భుజాల‌పైనే ఉంచింది. వ‌య‌స్సు రీత్యా కావ‌చ్చు, ఇంకే కార‌ణాలైనా కావ‌చ్చు.. యూపీ ఎన్నిక‌ల్లో ఆమె పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోయారు.

ఇప్పుడు మ‌ళ్లీ మ‌రోసారి ఢిల్లీ కాంగ్రెస్ బాధ్య‌త‌ల‌ను ఆమెకే అప్ప‌గించింది పార్టీ అధిష్ఠానం. ఢిల్లీ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షురాలిగా మ‌రోసారి షీలా దీక్షిత్‌ను నియ‌మించారు. ఈ మేర‌కు రాహుల్ గాంధీ శుక్ర‌వారం త‌న దుబాయ్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్ల‌డానికి ముందు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

షీలా దీక్షిత్ ప్ర‌త్యామ్నాయంగా కొంత‌మంది యువ నేత‌ల పేర్లను ఆయ‌న ప‌రిశీలించారు. దేవేంద‌ర్ యాద‌వ్‌, హ‌రూన్ యూసుఫ్‌, అర్వింద‌ర్ ల‌వ్లీ, రాజేష్ లిలోటియా వంటి యువ నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. వారి ప‌ట్ల రాహుల్ మొగ్గు చూప‌లేదు. డీపీపీసీ చీఫ్‌గా షీలాకే అవ‌కాశం ఇచ్చారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అనుభ‌వ‌జ్ఞుల సేవ‌ల‌ను గ‌రిష్ఠంగా వినియోగించుకోవాల‌నే ఉద్దేశంతోనే రాహుల్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతున్నారు. రాజ‌స్థాన్‌లో అశోక్ గెహ్లాట్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌మ‌ల్‌నాథ్ వంటి సీనియ‌ర్ల‌ను ముఖ్య‌మంత్రులుగా చేశారు.

అలాగే ఢిల్లీలో కూడా సీనియ‌ర్‌నే నియ‌మించాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఢిల్లీలో వ‌రుస‌గా మూడుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘ‌న‌త షీలా దీక్షిత్‌ది. దేశ‌మంతా కాంగ్రెస్ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న స‌మ‌యంలోనూ ఢిల్లీలో ఆమె పార్టీని అధికారంలోకి తీసుకుని రాగ‌లిగారు. అలాగే- వ‌రుస‌గా మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అనుభవం ఆమెకు ఉంది.