హిందీదేశంలో వ్యూహం మారింది, మోదీ పర్సనాలిటీయే అస్త్రం

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల వ్యూహం మారింది. మూడో దఫా పోలింగ్ ముగిశాక మోదీ తన పర్సనాలిటీ ని కొత్తగా ఆవిష్కరిస్తూ వస్తున్నారు.
మిగతా నాలుగు దశల ఎన్నికల్లో  వ్యక్తిగా తన మంచితనాన్ని జనం ముందుపెట్టి బేష్ అనిపించుకోవాలనుకుంటున్నట్లున్నారు.
బాలివుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ ఏదో ఆషామాషీ గా చేసింది కాదు. అదొకపథకం ప్రకారం, ఇంతవరకు తెలియని మోదీని, జనానికి కనిపించకుండా ఎక్కడో దాక్కుని ఉన్న కొత్త మోదీని, మంచి మోదీని,మానవతా వాది మోదీని ఆవిష్కరించే ఉద్దేశమే ఇంటర్వ్యూ అన్నట్లు సాగిందది.
ఇంతవరకు జరిగిన మూడు దశలలో మోదీ పర్సనాలిటీలో గుప్తంగా ఉన్న అంశాలను  వెలికి తీసే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు  బలమయిన దేశం, బలమయిన నాయకత్వం,బలమయిన సైన్యం,బలమయిన జాతీయ వాదం గురించే ఆయన మాట్లాడారు. ఈ విషయంలో పుల్వామా, బాలకోట్ ప్రస్తావనను తీసుకువచ్చి విమర్శల పాలయ్యారు. ఎన్నికల కమిషన్ కోడ్ ను కూడా ఉల్లంఘించారని విమర్శలొచ్చాయి. మోదీ మీద చర్య తీసుకోవాల్సిందేనని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్ అలసత్వం వహిస్తూ ఉందని ఇఎఎస్ శర్మ లాంటి మేధావులు ఎన్నికల కమిషన్ కు లేఖలు రాశారు. పలు మార్లు గుర్తుచేశారు.
మోదీ పర్సనాలిటీని ఆయన ‘బయోపిక్‘ జనం ముందు ప్రదర్శించి ఉండేదేమో. ఆచిత్రం ఎన్నికల కోడ్ లో ఇరుక్కపోయింది. అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ ఈ నష్టాన్ని పూరించేందుకే అనిపిస్తుంది.
బాలివుడ్ ప్రభావం భారతీయులు మీద ఎంతవుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మోదీ బాలివుడ్ బయోపిక్ రాలేదు. అందువల్ల బాలివుడ్ నటుడిని రంగంలోకి దించి ఇంటర్య్యూ చేయించినట్లు అర్థమవుతుంది.
అందులో మానవతావాది ,మృదుస్వభావి, సాత్వికుడయిన మోదీని ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది.గతంలో తన బట్టలు తానే ఉతుక్కునే వాడినని చెప్పితన జీవనశైలి ఎంత సింపుల్ గా ఉండేదో మోదీ వివరించారు.(దీనిమీద నెటిజన్ల సటైర్లు కూడా పవర్ ఫుల్ గానే వచ్చాయి. ఇది అబద్దమన్నారు. ఆయన చాలా కాలం బట్టలుతికిన దోబీని రంగం మీదకుతీసుకువచ్చారు. ఇదే వేరే విషయం).
మొత్తానికి అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ ద్వారా మోదీ కొత్త పర్సనాలిటీని వెలికి తీసే ప్రయత్నం జరిగింది.మోదీ సాధు స్వభావం ఈపర్సనాలిటి. ప్రధాన మంత్రి హోదా ఉన్నా ఆయన సాదాసీదా మనిషి, సింపుల్ మనిషి, హృదయమున్న మనిషి, పెద్దవారిని గౌరవించే మనసున్నమనిషి, చిన్ని పిల్లలను ప్రేమించే మనిషి అని,  ఇలాంటి వ్యక్తి నాయకత్వం దేశానికి అవసరం అనే సందేశాన్ని బిజెపి, జాతీయ వాదానికి, సైన్యానికి, హిందూత్వానికి జోడించాలనుకుంటున్నట్లు అర్థమవుతుంది.
దేశంలో సానుకూలపవనాలువీస్తున్నాయని మోదీ రెండు రోజుల వారణాసిలో విపరీతంగా వచ్చిన జనాన్ని చూసి ప్రకటించారు. బిజెపి బలంగా ఉన్న రాష్ట్రాలలో జనసమీకరణ చూపి ఇది మోదీ పర్సనాలిటీకి, మోదీ ప్రభుత్వానకి అనుకూలంగా  వీస్తున్నపవనాలని ఆ పార్టీ చెప్పబోతున్నది.
ఇంతవరకు జరిగిన క్యాంపెయిన్ లో  మోదీ పర్సనాలిటీని ప్రొజెక్టుచేసేందుకు వీలు కాలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన మూడు దశల ఎన్నికల్లో దక్షిణ భారత దేశం కూడా ఉంది. అక్కడ మోదీకి వచ్చిన స్పందన తక్కువ. ఆంధ్ర తెలంగాణలలో జనమే రాలేదు. తమిళనాడులో కూడా అంతే. అందువల్ల మోదీ పర్సనాలిటీ ప్రొజెక్టు చేయడం మంచిది కాదు. కాబట్టి బిజెపి చాలా తెలివిగా ఇక్కడ జాతీయ వాదం, సైన్యం,బాలకోట్, పుల్వామా వంటి సెంటిమెంటల్ విషయాలను ప్రచారం చేసింది.
హిందీ భూభాగంలో మోదీ అంటే జనాలు వస్తున్నారు. అందువల్ల మోదీ అంటే ఇంకా ఇష్టమున్న చోట పర్సానాలిటి మ్యాజిక్ ప్రయోగిస్తే మరింత ప్రయోజనముంటుంది. ఎందుకంటే, 2014 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో బిజెపికి 71, మిత్రపక్షం అప్నాదళ్ కు 2 సీట్లు అంటే 73 స్థానాలొచ్చాయి. ఈ సారి వీటిని బిఎస్ పి, ఎస్ సిల కూటమిని ఎదరించి కాపాడుకోవాలి. అదే విధంగాబీహార్ లో ఎన్ డి ఎ నెగ్గాలి. బెంగాల్ లో బలపడాలి. మహారాష్ట్రలో ఈవూపు కొనసాగాలి. అందువల్ల ఇక్కడ మోదీ నూతన వ్యక్తిత్వాన్ని పరిచయం చేయాలి.
అక్షయ్ కుమార్ చేసిన ఇంటర్వ్యలో ఇది మొదలయింది. వారణాసిలో ఆయన నామినేషన్ వేయడంతో మరింత ముందుకు సాగింది. ఇప్పటిదాకా 302 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మరొక 240స్థానాలున్నాయి. ఈ స్థానాలలో బిజెపి మోదీ పర్సనాలిటీ ప్రయోగించాలనుకుంటున్నది.
వారణాసిలో నామినేషన్ వేయడానికి ముందు, వేసిన తర్వాత ఆయన ప్రవర్తన చేస్తే ఇది అర్థమవుతుంది.నామినేషన్ వేసే ముందు ఆయన 93 సంవత్సరాల అకాలీ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ కు పాదాభివందనం చేశారు. ఆశీస్సులందుకున్నారు. తర్వాత తన పేరును ప్రతిపాదించిన 92 సంవత్సరాల అన్నపూర్ణ శుక్లాకు పాదాభివందనం చేశారు. ఈ పోటోలు నెట్ లో వైరలయ్యాయి. మోదీలో గొప్ప మావనవతా వాది ఉన్నారని ప్రశంసలందుతున్నాయి.