తెలంగాణ ఆడబిడ్డ కలెక్టర్ చంద్రకళ ఇంటి పై సిబిఐ దాడులు

యూపీ ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటి పై సీబీఐ అధికారులు దాడులు చేశారు. చంద్రకళ స్వస్థలం కరీంనగర్ జిల్లా. చంద్రకళ ప్రస్తుతం యూపీ కేడర్ లో పని చేస్తున్నారు. మైనింగ్ స్కాంలో ఆరోపణలతో చంద్రకళ ఇంటితో పాటు 12 చోట్ల సీబీఐ ఏక కాలంలో దాడులు చేసింది. యూపీతో పాట కరీంనగర్ జిల్లాలో దాడులు కొనసాగుతున్నాయి. ఇసుక మాఫీయాలో చంద్రకళ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న సీబిఐ అధికారులు చంద్రకళ ఆస్తుల పై దాడులు చేశారు. మొత్తం అయిదు జిల్లాలలో షామ్లి, ఫతేపూర్, హమీర్ పూర్,సిద్ధార్థ నగర్, దియోరియా జిల్లాలలో ఇసుక మైనింగ్ గురించి వచ్చిన ఆరోపణల మీద సిబిఐ విచారణకు పూనుకుంది. హమీర్ పూర్ కలెక్టర్ గా ఉన్నపుడు ఆమె నియమాలు ఉల్లంఘించి ఇసుక మైనింగ్ కు అనుమతిచ్చారని ఆరోపణ.

అయితే, సోషల్ మీడియా వేదిక గా చంద్రకళ అవినీతికి వ్యతిరేకంగా చాాలా పెద్ద క్యాంపెయిన్ చేశారు. ఆమె సోషల్ మీడియా లో చాలా పాపులర్ అధికారి.

నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా చంద్రకళలకు మంచి పేరు ఉంది.అందుకే ఆమె సిబిఐ టార్గెట్ కావడం పట్ల అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి పాల్పడే నాయకులే ఆమెను టార్గెట్ చేసి కేసులు వేశారని వారు ఆరోపిస్తున్నారు. యూపీ క్యాడర్ అధికారి అయిన తెలంగాణ తేజం చంద్రకళ యూపీలో మోసాలు చేస్తున్న కాంట్రాక్టర్లను హడలెత్తించారు. 2014లో నాసిరకం రోడ్లు వేసిన అధికారులను, కాంట్రాక్టర్లను పబ్లిగ్గా నిలదీసి సంచలనం సృష్టించారని చెబుతారు. 

 

ఓయూ నుంచి ఎంఏ పట్టా పుచ్చుకున్న చంద్రకళ 2008లో ఐఏఎస్ టాపర్ గా నిలిచారు. యూపీ కేడర్ కు ఆమెను కేటాయించారు.  బులంద్ షహర్, బిజ్నోర్, మీరట్ జిల్లాల కలెక్టర్ గా పని చేశారు. ఆమె స్వచ్చ భారత్ కోసం ఎంతగానో కృషి చేశారు. అవినీతి పై నిప్పులు చెరిగి సామాజిక మాధ్యమాల్లో చంద్రకళ పేరు సంపాదించుకున్నారు. డైనమిక్ ఆఫీసర్ గా ఆమెకు పేరుంది. బిజ్నోర్‌ను బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాగా మార్చేందుకు ఆమె చేపట్టిన చర్యలు కేంద్ర సర్కారు ప్రశంసలు పొందాయి.

ఇప్పుడామె నిజాయితీకి, కృషికి గుర్తింపుగా ప్రధాని నరేంద్రమోదీ ఆమెను తన డ్రీమ్‌ టీంలో చేర్చుకున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్‌గా, కేంద్ర తాగునీరు, పారిశుధ్ధ్య మంత్రిత్వశాఖ ఉపకార్యదర్శిగా నియమించారు. దీంతో ప్రస్తుతం మీరట్ కలెక్టర్‌గా ఉన్న చంద్రకళ ఢిల్లీకి మారింది.

ఉత్తర్‌ప్రదేశ్ ఐఏఎస్ అధికారిగా అనేక సంచలనాలకు కేంద్ర బిందువైన చంద్రకళ.. కాంట్రాక్టర్ల అవినీతిని నిలదీసిన వైనం సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇదేనా మీ పనితీరు? దీనికి మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది ప్రజల సొమ్ము. ముడుపులకూ ఓ హద్దుంటుంది అని ఆమె గర్జించిన తీరు అబ్బరపరిచింది. ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారులపై ఏకకాలంలో యుద్ధాన్ని ప్రకటించడం ఆమె సాహసానికి అద్దం పట్టింది.

 సోషల్ మీడియాలో చంద్రకళ పేరు అప్పుడు మారు మోగి పోయింది. కాంట్రాక్టర్ల ఆటలు సాగనివ్వనందున కొంత మంది అక్రమార్కులే చంద్రకళ పై అవినీతి ఆరోపణలు చేసి పిటిషన్ వేశారని చంద్రకళ బంధువులు ఆరోపిస్తున్నారు. తక్కువ కాలంలోనే కీలక పదవికి చేరుకోవడంతో ఇది గిట్టని వారే చంద్రకళ పై దాడులు చేసేలా చేశారన్నారు. విచారణలో అన్ని బయటకు వస్తాయని చంద్రకళ మరక లేకుండా బయటపడుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.