కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో మరోసారి ప్రకంపనలు చెలరేగాయి. కీలకమైన 2జీ స్పెక్ట్రమ్, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులను విచారిస్తున్న అధికారులు ఆకస్మికంగా బదిలీ అయ్యారు. వారితోపాటు 20 మంది అధికారులను బదిలీ చేస్తూ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌పై విచారణ చేస్తోన్న వివేక్ ప్రియదర్శి చండీగఢ్‌కు బదిలీ అయ్యారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌కె నాయర్‌ను ముంబై అవినీతి నిరోధక విభాగానికి బదిలీ చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీఎన్‌బీ స్కామ్‌లో- దేశం విడిచి పారిపోయిన నీరవ్‌మోడీ, మేహుల్ చోక్సీల ప్రమేయం ఉన్న విషయం తెలిసిందే.