కుంభ‌మేళా..అంత‌రిక్షం నుంచి ఇలా!

కుంభ‌మేళాను చూడాల‌నుకుంటే..ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ వ‌ర‌కు వెళ్లి రావ‌చ్చు. అదే- అంత‌రిక్షం నుంచి చూడాల‌నుకుంటే అంద‌రికీ సాధ్య‌ప‌డ‌దు. అలా చూడ‌టం ఓ అద్భుత‌మే అవుతుంది. అంత‌రిక్షం నుంచి కుంభ‌మేళా ఎలా క‌నిపిస్తుంద‌నే ప్ర‌శ్న‌కు ఇస్రో స‌మాధానం ఇచ్చింది. గతంలో తాము ప్ర‌యోగించిన కార్టోశాట్‌-2 ద్వారా కొన్ని ఫొటోల‌ను తీసింది ఇస్రో. వాటిల్లో రెండు ఫొటోల‌ను శుక్ర‌వారం విడుద‌ల చేసింది.

ఈ నెల 16వ తేదీన కార్టోశాట్‌-2 తీసిన పిక్స్ అవి. ప్ర‌యాగ్‌రాజ్ త్రివేణి సంగమం ప్రాంతాన్ని కార్టోశాట్ ఫొటోలు తీసింది. ఓ ప‌క్క య‌మునా న‌ది వంతెన‌, మ‌రొప‌క్క త్రివేణి సంగమం, ఇంకోప‌క్క న‌ది ఒడ్డునే ఉన్న కోట‌..ఇవ‌న్నీ ఈ పిక్‌లో చూడొచ్చు. త్రివేణి సంగ‌మంలో షాహీ స్నానాలు చేస్తోన్న భ‌క్తులు చీమ‌ల్లా క‌నిపిస్తారు.

ఈ కార్టోశాట్‌-2ను ఇస్రో గ‌త ఏడాది జ‌న‌వ‌రి 12న అంత‌రిక్షంలోకి ప్ర‌యోగించింది. ఇందులో పెన్ క్రొమేటిక్ కెమెరా అమ‌ర్చారు. ఈ కెమెరా ద్వారా కుంభ‌మేళా ఫొటోల‌ను తీశారు. కార్టోశాట్‌-2 భూమికి ఫొటోల‌ను చేర‌వేయ‌డం ఇది రెండోసారి. మొద‌టిసారిగా ఈ ఉప‌గ్రహం ఇండోర్‌లోని హోల్క‌ర్ స్టేడియం ఫొటోల‌ను ఇస్రోకు పంపించింది.