సాధారణంగా పెళ్లి కూతురు అనగానే బుగ్గన చుక్క పెట్టుకుని కండ్లకు కాటుక పెట్టుకొని సిగ్గులు ఒలక పోస్తూ కనిపిస్తుంది. పెళ్లి అని తెలిసినప్పటి నుంచే మరి కొందరిలో తెలియని భయం, సిగ్గు ఉంటాయి. కానీ పుణెలో ఓ పెళ్లి కూతురు మాత్రం వీటన్నింటిని తలదన్నేలా రియల్ హీరోయిన్ లా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీని చూసి అక్కడ ఉన్న వారంతా ఫిదా అయ్యారు.
మహారాష్ట్రలోని పుణెలో ఓ రైతు తన కూతురు పెండ్లి చేస్తున్నాడు. పుణే పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం పెళ్లి. పెళ్లి కూతురును హాల్ వద్దకు తీసుకొచ్చేందుకు కారును కూడా సిద్దం చేశారు. కానీ పెళ్లి కూతురు మాత్రం భిన్నంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బండిని తన ఇంటి దగ్గర నుంచి కళ్యాణ మండపం దగ్గరి వరకు నడుపుకుంటూ వచ్చింది. చేతికి వాచ్, మెడలో కండువా, కూల్ గ్లాస్ పెట్టుకొని స్టైల్ గా బండి డ్రైవ్ చేసింది. రోడ్డు వెంట ఆమె బండి నడుపుతుంటే అంతా ఆశ్చర్యపోయి చూశారు. ఆమె వెనుకాలే పెళ్లికారుతో పాటు మరికొన్ని కార్లు, బైక్ లు ఫాలో అయ్యాయి.
ఇక పెళ్లి కూతురు కళ్యాణ మండపానికి చేరుకోగానే కాబోయే భార్య స్టైల్ చూసి భర్త ఫిదా అయిపోయాడు. ఫంక్షన్ హాల్లో ఉన్నవారంతా కూడా పెళ్లి కూతురు ధైర్యం, స్టైల్ చూసి శభాష్ అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత అందరి దీవెనలతో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి కూతురు బైక్ నడిపిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మహారాష్ట్రలోనే కాకుండా ఇప్పుడు ఈ వార్త దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
మరి కొన్ని ఫోటోలు కింద ఉన్నాయి చూడండి