బిజెపి ఎలా కుంచించుకు పోయిందో చూడండి…

BJP shifts focus to Telangana

ఈ మధ్య ముగిసిన మూడు ముఖ్యమయిన హిందీ రాష్ట్రాల ఫలితాలు ఉత్త ఎన్నికల ఫలితాలు కాదు. దాంట్లో చాలా మర్మం ఉందని చెబుతూ ప్రఖ్యాత చరిత్రకారుడు విలియం డార్లైంపు ఒక ట్వీట్ (కింద) చేశారు. ట్వీట్ క్యాప్షన్ ‘ఎ న్యూ ఇండియా డాన్స్’ (A New India Dawns). దీనికి రెండు మ్యాప్ లను కూడా ఆయన జతపరిచారు. ఈ చిత్ర పటాలలో భారతీయజనతా పార్టీ ప్రాబల్యం ఎలా కుంచించుకుపోయిందో ఆయన చూపారు

అదెలాగంటే, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీష్ గడ్ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కూలిపోవడంతో ఆ పార్టీ పరిపాలనలో ఉన్న భారతీయుల సంఖ్య 25.4 కోట్లు తగ్గింది. 2017 నాటికి దేశజనాభాలో 88.8 కోట్ల జనాభా (71 శాతం) భారతీయ పార్టీ పాలనకింద ఉండేవారు. డిసెంబర్ 2018 ఎన్నికల తర్వాత ఇది 63.4 కోట్లకు (51 శాతం) తగ్గిపోయింది.

2014 మే 24 నాటి భారతీయ జనతా పార్టీ 7 రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉండింది. డిసెంబర్ 2018 నాటికి ఇది 16 రాష్ట్రాలకు పెరిగింది. కేంద్రం లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి (పేరుకు ఎన్డీయే అనుకోండి) ప్రభుత్వం ఏర్పడ్డాక అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్ (సంకీర్ణ ప్రభుత్వం), గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, ఉత్తరాఖండ్ , ఉత్తర ప్రదేశ్ లలో బిజెపి లేదా బిజెపి సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. ఒక దశలో ఇది 21 రాష్ట్రాలకు చేరుకుంది. దీనితో బిజెపి కాంగ్రెస్ ముక్త్ భారత్ వచ్చేస్తా ఉందని అరవడం మొదలుపెట్టింది. డిసెంబర్ ఎన్నికలతో ఒక్క సారి గా ఈ లెక్కలు తారు మారయ్యాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న భూభాగం 7 శాతం (2017) నుంచి 21 శాతానికి పెరిగింది.

తాజాగా ఎన్నికలు జరిగిన మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీష్ గడ్, మిజోరాం, తెలంగాణలలో 15.2 శాతం జనాభా ఉంది. ఇది భారత దేశంలో ఆరోవంతు. ఈ రాష్ట్రాల్లో 678 సీట్లున్నాయి. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం ఇందులో కాంగ్రెస్ 305 స్థానాలు గెల్చుకుంది. బిజెపి గెల్చుకున్నది కేవలం 199 సీట్లు మాత్రమే. 2013 లో గెల్చుకున్న స్థానాలలో బిజెపి 180 స్థానాలను కోల్పోయింది. 2013లో బిజెపి ఈ మూడు హిందీ రాష్ట్రాలలో 377 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ వాట 118 మాత్రమే. 2018 డిసెంబర్ 11 న ప్రకటించిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ వృద్ధి 137 శాతం కాగా బిజెపి పతనం 48 శాతం.

అందుకే డార్లైంపుల్ అలా ట్వీట్ చేశారేమో.