దారుణం: ఇండోనేషియా ఫుట్ బాల్ మ్యాచ్ లో హింసకాండ.. 127 మంది మృతి!

ఇండోనేషియాలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచాల్సింది పోయి తీవ్ర విషాదాన్ని నింపింది.ఎంతో సరదాగా సాగిపోతున్న ఈ ఆటలో ఒక్కసారిగా వివాదం చెలరేగడంతో ఇరు జట్ల మధ్య అభిమానులు పెద్ద ఎత్తున గొడవపడి తొక్కిసలాటలో ఏకంగా 127 మంది ప్రాణాలను కోల్పోయిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే…

ఇండోనేషియాలో అరెమా – పెర్సెబయా మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా వివాదం చెలరేగడంతో ఇరు జట్ల మధ్య అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లి పోట్లాడుకున్నారు.ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని కట్టడి చేయడానికి ప్రయత్నించిన సాధ్యం కాకపోవడంతో లాఠీ చార్జ్ చేశారు. అయినప్పటికీ ఏమాత్రం గొడవ సద్దుమనగకపోవడంతో పోలీసులు చేసేదేమీ లేక టియర్ గ్యాస్ వదిలారు. దీంతో ప్రేక్షకులు స్టేడియం నుంచి పరుగులు పెట్టడం మొదలుపెట్టారు.

ఇలా ఈ తొక్కిసలాటలో అలాగే టియర్ గ్యాస్ వదలడం వల్ల ఆక్సిజన్ అందక మరి కొంతమంది ప్రాణాలు వదిలారు. ఇప్పటికే ఈ హింసకాండలో ఏకంగా 127 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఈ సందర్భంగా ఇండోనేషియా పోలీసు చీఫ్ నికో అఫింటా ఈ ప్రమాదంపై మాట్లాడుతూ.. అరేమా ఎఫ్‌సి – పెర్సెబయా సురబయా మధ్య జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన జట్టు సభ్యులు దాడికి దిగడం వల్ల ఇలాంటి ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు.ఇక ఈ వివాదాన్ని సద్దుమనిచ్చే ప్రయత్నంలో పోలీసులు టియర్ గ్యాస్ వదిలారని ఊపిరాడిక చాలా మంది చనిపోయారని ఈ చనిపోయిన వారిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారని వెల్లడించారు.