కేరళ సహాయక శిబిరాలలో బిక్కు బిక్కుమంటూ ఉంటున్న వారిని తనకి ఉన్న కళతో అలరించి సందడి చేసిన మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆసియా బీవీకి సినిమాలో అవకాశం దక్కింది. మలయాళ సినిమాలో ఆమెకు అవకాశం కల్పించనున్నట్టు దర్శకుడు శనవాస్ ఏ బవకుట్టి ప్రకటించారు.
కేరళలో సంభవించిన ప్రకృతి విలయానికి 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా లక్షల మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కేరళ వరద బాధితుల కోసం ఎంతోమంది తమకు తోచిన సహాయం అందిస్తున్నారు. కానీ విట్టిలాలో ట్రాఫిక్ వార్డెన్ గా ఉన్న ఆసియా బీవీ భిన్న రీతిలో వారికి తన సహాయం అందివ్వాలి అనుకుంది.
సహాయక శిబిరాల్లో ఉన్నవారంతా మనోవేదనకు గురయ్యుంటారు, రోజు సరదాగా ఆడుకుంటూ అల్లరి చేసే పిల్లలు కూడా ఈ వరద భీభత్సానికి కలత చెంది ఉంటారు. ఆ బాధ నుండి వారిని డైవర్ట్ చేయాలి అనుకుంది ఆసియా. అనుకున్నదే తడవుగా ఒక పునరావాస కేంద్రానికి వెళ్లి తనకు తెలిసిన డాన్స్ కళతో సందడి చేసింది. “జిమ్మిక్కి కమ్మల్” సాంగ్ కి డాన్స్ చేసి అక్కడ ఉన్నవారి కళ్ళల్లో ఉత్తేజాన్ని నింపింది. పిల్లలతో కలిసి స్టెప్పులేసి అలరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీడియోని నెటిజెన్ల విపరీతంగా షేర్ చేయడంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది ఆసియా. అందరూ తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన మలయాళ దర్శకుడు శనవాస్ ఏ బవకుట్టి తన తదుపరి సినిమాలో ఆసియాకు కీలక పాత్ర ఇచ్చారు. కేరళ వరద బాధితుల కోసం ఆమె చేసిన డాన్స్ ఇప్పుడు ఆమెకు సినిమా ఆఫర్ తెచ్చిపెట్టడంతో సంతోషంలో మునిగిపోతుంది ఆసియా. వైరల్ అవుతున్న ఆసియా డాన్స్ వీడియో కింద ఉంది చూడవచ్చు.