దేశంలో సుదీర్ఘ కాలంపాటు విచారణ అనంతరం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అయోధ్యలో నిర్మిస్తున్న మసీదుకు ఎవరూ విరాళాలు ఇవ్వకూడదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదును అసలు మసీదనే పిలవొద్దంటూ… ఆ మసీదులో నమాజ్ చేయడం ఇస్లాంకు వ్యతిరేకం అని అన్నారు. మంగళవారం బీదర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ముస్లిం మత పెద్దలతో మాట్లాడిన తర్వాతే.. తాను ఈ విషయం చెబుతున్నట్టు వివరించారు. అయోధ్యలో కడుతున్న ఆ నిర్మాణం మసీదు కాదని, అక్కడ ప్రార్థనలు చేయకూడదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన ఉలేమాలే చెబుతున్నారంటూ ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మోదీని ఆరాధిస్తున్నారు.. అందరూ మోదీ భక్తులుగా మారారన్న ఓవైసీ.. బీదర్ మున్సిపల్ ఎన్నికల ముందు ముస్లింలు దళితులు ఐక్యంగా ఉండాలన్నారు. ముస్లింలు దళితులతో ఎప్పుడూ పోటీకి దిగొద్దన్న అసద్ ళితులను కలుపుకొని పోవాలని ముస్లింలను కోరారు. త్వరలో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయనుంది.
మరోవైపు అసదుద్దీన్ వ్యాఖ్యలను… అయోధ్య మసీదు ట్రస్ట్ సెక్రటరీ అథర్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. మసీదు కోసం విరాళాలకై మేము విజ్ఞప్తి చేశామని ప్రజలు ఇప్పటికే సహకారం అందించడం ప్రారంభించారని, అసదుద్దీన్ మాటలు రాజకీయ ఎజెండాలో భాగమని విమర్శించారు. ఇస్లాంకు వ్యతిరేకమైన చిన్న ప్రదేశం కూడా ఈ ప్రపంచంలో లేదని అన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌కు చరిత్ర తెలియదని, మొదటి స్వాతంత్య్ర యుద్ధ పోరాటంలో పడిన బాధలను వారి కుటుంబం అనుభవించలేదని అథర్ హుస్సేన్ విమర్శించారు.