శబరిమల ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా 50 ఏళ్ల లోపు వయస్సున్న మరో మహిళ కూడా అయ్యప్ప స్వామిని దర్శించారు. నల్ల దుస్తులను ధరించి, మెడలో అయ్యప్ప మాలతో, తలపై ఇరుముడి కట్టుకుని ఆలయ ప్రాంగణంలో నిల్చున్న ఫొటోను ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అయ్యప్ప మాలను ధరించిన ఫొటోకు సాధారణ దుస్తుల్లో ఉన్న మరో ఫొటోను జోడించి తన ఫేస్‌బుక్ గ్రూప్‌లో ఉంచారు.
దీనితో పాటు అయ్యప్ప స్వామి ఆలయం లోపలకు వెళ్లిన దృశ్యంతో కూడిన ఆరు సెకెన్ల నిడివి గల ఓ వీడియోను ఆమె పొందుపరిచారు. సుమారు రెండు గంటల తరువాత ఆ ఫొటోలను ఆమె తొలగించారు. అప్పటికే ఆ ఫొటోలు, వీడియో వైరల్‌గా మారాయి. శబరిమల దేవస్థానంలోకి మహిళల ప్రవేశంపై చెలరేగుతున్న ఆందోళనల నేపథ్యంలోనూ స్వామి వారిని దర్శించుకున్న మహిళల సంఖ్య నాలుగుకు చేరింది. ఆమె పేరు మంజు.
కొల్లం సమీపంలోని ఛత్తన్నూర్ ఆమె స్వస్థలం. వయస్సు 42 సంవత్సరాలు. తన స్నేహితులతో కలిసి ఆమె `నవోత్థాన కేరళం శబరిమలయిక్కళ్` అనే ఫేస్‌బుక్ గ్రూప్‌ను నడిపిస్తున్నారు. మంగళవారం ఉదయం 18 మెట్లు ఎక్కి, మూలవిరాట్టును సందర్శించానని, దీనికి రుజువు ఇదిగో అంటూ ఫొటోలు, వీడియోలను ఆ గ్రూప్‌లో పోస్ట్ చేశారు.
ఆ తరువాత దాన్ని తొలగించారు. అప్పటికే అవి వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న సంఘ్ పరివార్ నాయకులు ఆమె ఇంటిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. దాడి జరిగిన విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.ఇంతగా కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టినప్పటికీ.. ఆమె గర్భగుడి దాకా ఎలా వెళ్లిందనేది చర్చనీయాంశమైంది.