పాకిస్థాన్‌కు దడ పుట్టించే మరో వార్త

భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దాయాదికి వణుకుపుట్టించే మరో వార్త ఇది. రష్యాతో ఐదారేళ్ల కాలానికి లీజుకు తీసుకున్న అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అటాక్ సబ్‌మెరైన్ అకుల-2 భారత్‌కు పయనమైంది. ఈ డీల్ విలువ 3 బిలియన్ డాలర్లు.

మన దేశం వద్ద ప్రస్తుతం అకుల-2 అటాక్ సబ్‌మెరైన్ ఉంది. దీనిని చక్ర-2గా పిలుస్తున్నారు. 2012లో రష్యా నుంచి దీనిని పదేళ్ల కాలానికి లీజుకు తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అకుల-2 వచ్చే ఐదారేళ్లు భారత నేవీకి సేవలు అందించనుంది. దీనిని చక్ర-3గా పిలవనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, రష్యా నుంచి భారత నేవీ లీజుకు తీసుకున్న మూడో సబ్‌మెరైన్ ఇది.

అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ రెండో సబ్‌మెరైన్ వచ్చి చేరితే సముద్ర జలాల్లో భారత నేవీ మరింత శత్రుదుర్భేధ్యంగా మారుతుందని మిలటరీ వ్యవహారాల నిపుణుడు రియర్ అడ్మిరల్ సుదర్శన్ ష్రిఖండే (రిటైర్డ్) పేర్కొన్నారు.

అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అకుల-2 అటాక్ సబ్‌మెరైన్ కాకుండా భారత్ వద్ద ప్రస్తుతం 13 సంప్రదాయ జలాంతర్గాములు, ఒక స్కార్పేన్-క్లాస్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి, దేశీయ అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ సేవలు అందిస్తున్నాయి. అరిఘట్‌గా పిలిచే సెకెండ్ అరిహంత్-క్లాస్ జలాంతర్గామిని 2017లో రహస్యంగా ప్రారంభించారు. 2021లో ఇది నావికాదళంలో చేరనుంది.