సమాజ్ వాది పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫోన్ చేశారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న బాబుకు లక్నోనుంచి అఖిలేష్ పోన్ చేసి బిజెపికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో సెక్యులర్ శక్తులు ఏకం చేసేందుకు కృషి ముమ్మరం చేయాల్సిన అవసరం గురించి చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న చంద్రబాబు నాయుడు వంటి నాయకుడు చొరవ తీసుకోవాలని, దీనికి తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని అఖిలేష్ చెప్పారు. వారిరువురు బిజెపి యేతర పార్టీలను ఏకం చేసే విషయం గురించే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
కాంగ్రెస్ తో సహా అన్ని విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావల్సిన ఆవశ్యకత ఉందని, ఇందులో ప్రధాన పాత్ర పోషించాలని ఆయన చంద్రబాబును కోరినట్లు తెలుగుదేశం వర్గాలు తెలిపాయి.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత తమ వంటి సెక్యులర్ పార్టీల పై ఉందని ముఖ్యమంత్రితో అఖిలేష్ యాదవ్ అన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసిస్తూ రాష్ట్రానికి సమాజ్ వాది పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని అఖిలేష్ యాదవ్ చెప్పారు. కేవలం నాలుగేళ్లలో గొప్ప అభివృద్ధిని సాధించారని కూడా అఖిలేష్ కొనియాడారు.జాతీయ స్థాయిలో తనకున్న ఇమేజితో బిజేపియేతర పార్టీలను ఏకం చేయాలని అఖిలేష్ చంద్రబాబుకు సూచించారు.
ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఆర్ధిక వ్యవస్థను బిజెపి ప్రభుత్వం అస్తవ్యస్థం చేసిందని, బ్యాంకుల నిరర్ధక ఆస్తులు నాలుగున్నరేళ్లలో ఆరేడు రెట్లు పెంచేశారని అన్నారు.
‘రూపాయి విలువను దారుణంగా పతనం చేశారు. రైతుల్లో తీవ్ర అశాంతి సృష్టించారు. ఎస్సీ,ఎస్టీ,ముస్లింలలో అభద్రత పెరిగింది. ఈ నేపథ్యంలో భావ సారూప్యం ఉన్న పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు రావాలి,’ అని చంద్రబాబు అఖిలేష్ కు చెప్పారు. బిజేపియేతర పార్టీలను ఒక తాటిమీదకు తేవాలని, దీనికోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని చంద్రబాబు అఖిలేష్ ను కోరారు.