కొంతమంది జంతు ప్రియులు జంతువుల్ని మనుషులకంటే ప్రేమగా చూసుకుంటారు. చాలామంది ఇళ్లలో ఎక్కువగా పెంచుకునేది కుక్కని. వీటిని ఇక తమ ఇంట్లోని వ్యక్తిలానే భావిస్తారు. వాటికి నామకరణాలు, బారసాలలు, పుట్టిన రోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించిన దాఖలాలు కోకొల్లలు. తాము ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కల్ని పొరపాటున వారిముందు కుక్క అని పిలిస్తే కోపం కూడా వస్తుంది వారికి. ఇక దాని జోలికి ఎవరైనా వస్తే గొడవకు దిగడానికి కూడా వెనుకాడరు. గొడవ పడటం వరకు అయితే ఓకే కానీ వాటి కోసం హత్యలు కూడా చేస్తున్నారు ఈమధ్య. ఇలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.
ఢిల్లీలో దారుణం జరిగింది. కుక్కకి క్షమాపణ చెప్పలేదని ఒక వ్యక్తిని దారుణంగా పొడిచి చంపేశారు ముగ్గురు వ్యక్తులు. ఈ ఘటన ఇప్పుడు దేశ రాజధానిలో సంచలనంగా మారింది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో అంకిత్, పరాస్, దేవ్ చోప్రా అనే ముగ్గురు వ్యక్తులు ఆదివారం సాయంత్రం వారి పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ కి వెళుతున్నారు. వారి ఇంటికి పొరుగున ఉండే విజేందర్ రాణా ఒక ట్రక్కు డ్రైవర్. వారు వాకింగ్ కి బయటకు వచ్చిన సమయంలోనే రాణా తన వాహనంతో వేగంగా వారి పక్క నుండి వెళ్ళాడు. ఆ వేగానికి భయపడ్డ కుక్క ట్రక్కును చూసి మొరగటం ప్రారంభించింది.
ఆగ్రహానికి గురైన అంకిత్, పరాస్, దేవ్ చోప్రా తమ కుక్కకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీనికి రాణా నిరాకరించాడు. అసహనానికి గురైన ముగ్గురూ కలిసి విచక్షణారహితంగా స్క్రూడ్రైవర్లు, కత్తులతో రాణాను పొడిచారు. ఇది గమనించిన రాణా సోదరుడు రాజేష్ హుటాహుటిన అక్కడికి చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. విచక్షణ కోల్పోయిన ఆ ముగ్గురూ రాజేష్ ని కూడా పొడిచారు. ఈ ఘటనలో రాణా అక్కడికక్కడే మరణించాడు. రాజేష్ మాత్రం ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.