Dog Bite: కుక్క కరిచిన వెంటనే ఈ తప్పులు చేస్తే.. ప్రాణానికే ప్రమాదం..!

వీధుల్లో తిరిగే కుక్కల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యుల జీవితం ఆందోళనగా మారుతోంది. చాలాసార్లు నిశ్శబ్దంగా కనిపించే కుక్కలే ఒక్కసారిగా దాడి చేసి ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై జరిగే కుక్క కాటు సంఘటనలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. చాలా మంది దీనిని చిన్న గాయంగా తీసుకుని నిర్లక్ష్యం చేయడం మరింత ప్రమాదకరంగా మారుతోంది.

వైద్య నిపుణుల ప్రకారం కుక్క కాటు కేవలం గాయం మాత్రమే కాదు.. రేబిస్ అనే ప్రాణాంతక వ్యాధికి ప్రధాన కారణం. వీధి కుక్కలే కాదు, సరైన శిక్షణ లేకుండా పెంచుతున్న పెంపుడు కుక్కలు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతున్నాయి. అనారోగ్యంతో ఉన్నప్పుడు, నొప్పితో బాధపడుతున్నప్పుడు లేదా తమ పిల్లలను, ఆహారాన్ని కాపాడుకునే సందర్భాల్లో కుక్కలు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రేబిస్ సోకిన కుక్కలు విచక్షణ కోల్పోయి పిచ్చివాటిలా ప్రవర్తిస్తూ ఎదురుగా ఎవరున్నా కరిచేందుకు ప్రయత్నిస్తాయి.

కుక్క కరిచిన వెంటనే చాలా మంది నేరుగా ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆసుపత్రికి వెళ్లే ముందు కొన్ని కీలక జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుక్క కరిచిన భాగాన్ని వెంటనే పారుతున్న నీటిలో ఉంచి సబ్బుతో కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు కడగాలి. ఇలా చేయడం వల్ల కుక్క లాలాజలంలో ఉన్న వైరస్ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. గాయం నుంచి రక్తస్రావం జరుగుతుంటే శుభ్రమైన గుడ్డతో మృదువుగా ఒత్తాలి. అందుబాటులో ఉంటే యాంటీబయాటిక్ క్రీమ్ రాయడం మంచిది. దుమ్ము, ధూళి గాయంలోకి వెళ్లకుండా శుభ్రమైన వస్త్రంతో కట్టు కట్టాలి.

అయితే కుక్క కాటు తర్వాత ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుని ఉండిపోవడం అత్యంత ప్రమాదకరం. తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. డాక్టర్లు టెటానస్ ఇంజెక్షన్‌తో పాటు అవసరమైతే రేబిస్ టీకాలు సూచిస్తారు. కుక్కకు టీకాలు వేశారో లేదో తెలియని పరిస్థితుల్లో రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి. గాయం లోతుగా ఉంటే కుట్లు అవసరమా కాదా అన్నది వైద్యుడే నిర్ణయిస్తారు.

సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రేబిస్ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. గాయం వద్ద తీవ్రమైన నొప్పి, వాపు, ఎరుపు కనిపించడం, జ్వరం రావడం, తలనొప్పి, గందరగోళం వంటి లక్షణాలు మొదలవుతాయి. ముఖ్యంగా నీటిని చూసినప్పుడు భయపడడం రేబిస్‌కు ప్రధాన లక్షణంగా వైద్యులు చెబుతున్నారు. ఒకసారి ఈ వ్యాధి లక్షణాలు బయటపడితే చికిత్స ఉండదు. నివారణ ఒక్కటే మార్గం. అందుకే కుక్క కాటు విషయాన్ని ఎప్పటికీ తేలికగా తీసుకోకూడదు. వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండటం, పిల్లలను ఒంటరిగా వదలకపోవడం, పెంపుడు కుక్కలకు సమయానికి టీకాలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక చిన్న జాగ్రత్త.. ఒక ప్రాణాన్ని కాపాడగలదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.