పాలకులు మరచిన ప్రజలు 

కరోనా కష్ట కాలంలో పాలకులు అనేక చర్యలు తీసుకున్నారు. మొదట ఈ వ్యాధి 2019 డిసెంబర్ లోనే వచ్చిందనే వార్తలు వచ్చినా మార్చి మొదటి పక్షం వరకూ నిద్రపోయిన పాలకులు మార్చి రెండో పక్షంలో కళ్ళు తెరిచారు. కేసులు వచ్చి, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసినప్పుడే విమానాశ్రయాలు మూసేయడమో లేక విదేశీ ప్రయాణికులను నియంత్రించడమో లేక విమానాశ్రయాల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించడమో చేసుంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదు. పాలకులు అప్పట్లో నిద్రపోయారు. 
 
నిద్రనుండి మార్చి 20 తర్వాత మేలుకున్న పాలకులు బుర్రకు పనిచెప్పడం మానేశారు. పోలీసుల కర్రలకు పని ఇచ్చారు. మొదట జనతా కర్ఫ్యూ అన్నప్పుడు కూడా వలస కార్మికులు ఈ దేశంలో భాగమే అనే స్పృహ కోల్పోయారు మన పాలకులు. ఆ తర్వాత లాక్ డౌన్ ప్రకటించి వలస కార్మికులను పూర్తిగా విస్మరించారు. 
 
స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా దేశంలో లక్షలాది మంది ప్రజలు పొట్టచేత పట్టుకొని రోజు కూలి కోసం రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళుతున్నారనే స్పృహ పాలకులకు లేకపోవడం లేదా అలాంటి పరిస్థితి ఇంకా ఉన్నందుకు సిగ్గు పడకపోవడం మన ప్రజాస్వామ్య గొప్పదనం. లాక్ డౌన్ ప్రకటించి రైళ్లు, బస్సులు, లారీలు ఎక్కడివక్కడే నిలిపేసిన పాలకులు ఈ వలస కార్మికుల సంగతి ఆలోచించకపోవడం అమానవీయం. 
 
మొదట ఈ వలస కూలీలను ఇళ్ళకు చేర్చే పని జరిగి ఉండాలి లేదా వారు ఎక్కడ ఉన్నారో అక్కడే వసతి, భోజన సదుపాయాలు కల్పించి ఉండాలి. దేశంలోని గోదాముల్లో 7 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. వాటిని ఖర్చు చేసి ఉండొచ్చు. అలాంటి ప్రయత్నాలు జరగకుండా వారు అనాధల్లా రోడ్డు పక్కన నిద్రపోతూ, రోడ్డు వెంబడి నడుస్తూ ఉంటే పాలకులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. 
 
ఇప్పుడు మాత్రం డబ్బున్నోళ్ళ కోసం ఏకంగా ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు. ప్రత్యేక విమానాలను స్వాగతించాల్సిందే. కానీ ఈ కూలీలను మరిచిపోవడాన్ని ఏమనాలి?