అదే.. జగన్ కి శ్రీరామరక్ష !

 
మన రాజకీయ వ్యవస్థలోనే విమర్శల అస్త్రాలు ప్రధానం అని మన నాయకులు బలంగా నమ్ముతున్నట్లు ఉంది నేటి పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డిగారి తీరు  అత్యున్నతమైన హీన రాజకీయాన్ని గుర్తు చేస్తోంది. అసలు విజయ సాయి రెడ్డికి ప్రజల కష్టాలు పట్టవా ? ఎంతసేపూ చంద్రబాబు దద్దమ్మ,  దొంగ, నీచుడు అంటూ తన నీచత్వాన్ని బయటపరుస్తున్నాడు.  రోజూ ఏదోక కామెంట్స్ చేయకపోతే విజయ సాయి రెడ్డికి ముద్ద దిగదా ? అసలు ‘చంద్రబాబు అనే వ్యక్తి మాకు పనికిరాడు, మాకు అక్కర్లేదు’ అనేగా ప్రజలు ఆయనను ఇంటికి సాగనంపింది.        
 
 
మరి చంద్రబాబు నాయుడు పై  వైసీపీ నేతలు  నిత్యం విమర్శలు చేస్తూ కాలయాపన చేయడం ఎందుకు ? నిజమే..  కరోనా వైరస్ మహమ్మారి పై,  వైజాగ్ ఘటన విషయంలో రాష్ట్ర వైఖరిని  ప్రశ్నిస్తూ చంద్రబాబు చేస్తున్న విమర్శల తక్కువేం కాదు. కానీ బాబు మాటలను టీడీపీ కార్యకర్తలు కూడా పట్టించుకోవట్లేదు అనేది కాదనలేని సత్యం. మూడు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే బాబు సాధించింది ఏమిటి ? మళ్ళీ మరో అవకాశం బాబుకి ఎందుకు ఇవ్వాలి ? అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు కాబట్టే  ఆయన్ను  23 సీట్లతో చిత్తుగా ఓడించారు.  
 
అవన్నీ వదిలేసి విజయ సాయి రెడ్డి మళ్ళీ విమర్శలు చేస్తూ..  ’23 సీట్లతో చిత్తుగా ఓడి ఏడాది తిరగకముందే చంద్రబాబు తన పరిపాలన ను తానే మెచ్చుకుంటుంటే.. కోతి మొహం కోతికి ముద్దు’ అంటూ  కామెంట్ చేశాడు. కాలం చెల్లిన ఆలోచనలకు ఎంత పదును పెట్టినా ప్రయోజనం ఉండదు, అడ్డంగా దొరికిపోయావు బాబు’ అని సాయి రెడ్డి   వ్యాఖ్యానించారు. బాబు పై వైసీపీ నేతలు మండిపడటం,  ఘాటు విమర్శలు చేయడం అనవసరం అని సాయి రెడ్డి ఇప్పటికైనా గుర్తిస్తే అది జగన్ కే మంచింది.  ప్రజలు అడ్డగోలు తిట్ల రాజకీయాన్ని ఎప్పుడూ హర్షించరు. అందుకే జగన్,  సాయిరెడ్డి మౌనంగా ఉంచాలి. అదే జగన్ కి శ్రీరామరక్ష !