ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగా టీడీపీ, జనసేన ఎప్పుడూ కామెంట్లు చేయలేదనే సంగతి తెలిసిందే. జగన్ ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలను టీడీపీ, జనసేన విమర్శిస్తూ వచ్చాయి. జగన్ అమలు చేస్తున్న పథకాలపై కూడా టీడీపీ, జనసేన చాలా సందర్భాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయనే సంగతి తెలిసిందే. అయితే జనసేన నుంచి జగన్ కు తొలి ప్రశంస దక్కింది.
తాజాగా ఏపీ సీఎం జగన్ ప్లాస్టిక్ ప్లెక్సీలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్ల నుంచి, జనసేన నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ సీనియర్ నేతలలో ఒకరైన బొలిశెట్టి సత్యనారాయణ సీఎం జగన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. అదే సమయంలో ఫ్లెక్సీలను ఉపాధిగా చేసుకున్న వాళ్లకు దారి చూపాలని ఆయన కోరారు. టీడీపీ కూడా ఈ విషయంలో మారితే మంచిదని చెప్పవచ్చు.
ప్రభుత్వం ఏదైనా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే విరుచుకుపడే టీడీపీ వైసీపీ తీసుకుంటున్న మంచి నిర్ణయాలను మాత్రం సమర్థించకపోవడంపై నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు సర్కార్ మంచి పనులు చేసే సమయంలో మెచ్చుకుంటే మాత్రమే తప్పు చేసిన సమయంలో నిలదీసినా ప్రజల నుంచి విపక్షాలకు మంచి మార్కులు పడతాయి.
ఏపీలో వైసీపీ పాలన బాగానే ఉన్నా మరీ అద్భుతంగా అయితే లేదని నెటిజన్లలో ఎక్కువమంది భావిస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చినా వైసీపీ కంటే అద్భుతాలు అయితే చేసే అవకాశాలు మాత్రం లేవని నెటిజన్లలో చాలామంది భావిస్తున్నారు. చంద్రబాబు, పవన్ జగన్ పాలనను మెచ్చుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నామని కొందరు వైసీపీ అభిమానులు చెబుతుండటం గమనార్హం. జనసేన నేత పాజిటివ్ కామెంట్ల గురించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.