వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వైసీపీని స్థాపించగా ఆ సమయంలో జగన్ కు అండగా నిలిచిన వాళ్లు చాలా తక్కువమంది అనే సంగతి తెలిసిందే. అలా జగన్ కు సపోర్ట్ చేసిన వాళ్లలో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒకరు. కడపకు చెందిన శ్రీకాంత్ రెడ్డికి ప్రజల్లో మంచి పేరు ఉండటంతో పాటు జగన్ కు సన్నిహితుడిగా మంచి పేరు ఉంది. శ్రీకాంత్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆయన అభిమానులు భావించినా అందుకు భిన్నంగా జరిగింది.
శ్రీకాంత్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి కూడా ఎంతో నమ్మకమైన వ్యక్తి కావడం గమనార్హం. రాజంపేట కాకుండా వైసీపీ రాయచోటిని జిల్లా చేయడానికి శ్రీకాంత్ రెడ్డి కారణమని చాలామంది భావిస్తారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నుంచి శ్రీకాంత్ రెడ్డికి ఆఫర్లు వచ్చినా ఆయన మాత్రం వైసీపీని వీడకపోవడం గమనార్హం. శ్రీకాంత్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి సామాజిక సమీకరణలే కారణమని బోగట్టా.
రాయలసీమలోని అన్ని జిల్లాలలో వైసీపీ తరపున గెలిచిన రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. రెడ్డి ఎమ్మెల్యేలకే ఎక్కువగా పదవులను ఇస్తే విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ కారణం వల్లే శ్రీకాంత్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదని సమాచారం. శ్రీకాంత్ రెడ్డికి వేర్వేరు అంశాలపై మంచి పరిజ్ఞానం ఉంది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా సమర్థవంతంగా విధులు నిర్వహించగలరని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
2024లో వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం శ్రీకాంత్ రెడ్డికి కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పదవి దక్కకపోయినా ఆయనకు చీఫ్ విప్ హోదా దక్కిందనే సంగతి తెలిసిందే. గతంలో శ్రీకాంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే వైసీపీ కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిందని ఆరోపణలు ఉన్నాయి ఈ కారణం కూడా ఆయనకు మంత్రి పదవి దక్కకుండా చేసిందని కొంతమంది భావిస్తారు.