Attack Movie Review : అవసరానికి మించి సూపర్ సోల్జర్ ‘ఎటాక్’ మూవీ రివ్యూ!

రేటింగ్ : 2.5/5

రచన- దర్శకత్వం : లక్ష్య రాజ్ ఆనంద్

తారాగణం : జాన్ అబ్రహాం, రకుల్ ప్రీత్ సింగ్, జాక్విలిన్ పెర్నాండెజ్, 

ప్రకాష్ రాజ్, రంజిత్ కపూర్, కిరణ్ కుమార్, ఎల్హమ్ ఎహ్సాస్ తదితరులు

సంగీతం ; శాశ్వత్ సచ్ దేవ్

ఛాయాగ్రహణం : విల్ హమ్ప్రిస్, పిఎస్ వినోద్, సౌమిక్ ముఖర్జీ

బ్యానర్స్ : ఏకే ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్

నిర్మాతలు : జయంతీ లాల్ గడా, అజయ్ కపూర్, భౌమిక్ గొండాలియా

Attack Movie Review : జాన్ అబ్రహాం యాక్షన్ సినిమాల వరుసలో ‘ఎటాక్ పార్ట్- 1’ కాన్సెప్ట్ పరంగా ఇంకో ముందడుగెస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చింది.కొత్త దర్శకుడు లక్ష్య రాజ్ ఆనంద్ దీన్ని జాన్ అబ్రహాంకి గర్వకారణంగా వుండాలని శక్తి వంచన లేకుండా కృషి చేశాడు.

రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్ ల వంటి తెలుగు ప్రేక్షకులకి తెలిసిన తారల్ని నటింప జేశాడు.అయితే ఏమిటా కొత్త కాన్సెప్ట్? దీన్నెలా తీర్చి దిద్దాడు? ఇది వర్కౌట్ అయిందా లేదా?….ఈ విషయ్తాలు పరిశీలిద్దాం.

కథ

ఆర్మీ మేజర్ అర్జున్ షేర్గిల్ (జాన్ అబ్రహాం) తన బృందంతో సరిహద్దులో టెర్రరిస్టుల శిబిరంలోకి చొరబడి,రెహమాన్ గుల్ అనే టెర్రరిస్టుని పట్టుకుంటాడు.అతని టీనేజీ కొడుకు హమీద్ గుల్ ఆత్మాహుతి బాంబుతో దొరికిపోతే, అర్జున్ ఆ బాంబుని నిర్వీర్యం చేసి,అతడ్ని వెళ్ళి పొమ్మంటాడు.

ఇది 2010 లో జరుగుతుంది. ప్రస్తుత కాలానికొస్తే, ఐషా (జాక్విలిన్ ఫెర్నాండెజ్) అనే ఏర్ హోస్టెస్ ని అర్జున్ ప్రేమిస్తాడు. ఈమె టెర్రరిస్టులు ఏర్ పోర్టు మీద చేసిన దాడిలో చనిపోతుంది.ఇదే దాడిలో అర్జున్ తీవ్రంగా గాయపడి పక్షవాతానికి లోనవుతాడు.

శరీరంలో చలనం లేక వీల్ చైర్ కి పరిమితమై జీవిస్తూంటాడు.

ఇప్పుడు పెరిగి పెద్దవాడైన హమీద్ గుల్ (ఎల్హామ్ ఎహ్సాస్) తీవ్రవాద దాడులకి పాల్పడుతున్నాడని అర్జున్ గ్రహిస్తాడు.ఈ తీవ్రవాద ముప్పుని ఎదుర్కోవడానికి రక్షణ శాఖ ఉన్నతాధికారి సుబ్రహ్మణ్యం (ప్రకాష్ రాజ్) సూపర్ సోల్జర్ అనే వినూత్న ప్రోగ్రాంని ప్రవేశపెట్టాలని హోమ్ మంత్రి ని కోరుతాడు.

ఈ ప్రోగ్రాం ప్రకారం, సైనికుడి శరీరంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చిప్ అమరుస్తారు. ఆ చిప్ అతడ్ని అజేయ శక్తిగానూ,ఏకవ్యక్తి సైన్యంగానూ మార్చేస్తుంది.

ఈ ప్రోగ్రాం రూపకర్త రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థలో పని చేసే డాక్టర్ సబా ఖురేషి (రకుల్ ప్రీత్ సింగ్) ప్రయోగ దశలో వున్న ఈ ప్రోగ్రాంని పరీక్షించాలంటే,పక్షవాతానికి గురైన సైనికుడి శరీరం అవసరమని ఆమె చెప్తుంది.

ఇక సుబ్రమణ్యం అర్జున్‌ని సంప్రదిస్తే, అర్జున్ అంగీకరిస్తాడు. అతడి శరీరంలో చిప్ అమరిక సక్సెస్ అయి తిరిగి మామూలు మనిషవుతాడు. దొంగల్ని పట్టుకోవాల్సి వచ్చి పోరాటానికి దిగితే, ఆ పోరాటంలో తానెంత శక్తిమంతుడో తెలుస్తుంది.

ఇంతలో 2010 లో పట్టుబడి జైల్లో మగ్గుతున్న టెర్రరిస్టు రెహమాన్ గుల్ ని విడిపించుకోవడానికి, అతడి కొడుకు హమీద్ గుల్ పార్లమెంటుని ముట్టడించి ప్రధాని సహా, 300 మంది ఎంపీ లని బంధించేసి బేరం పెడతాడు.

ఇక తక్షణం హమీద్ గుల్ ఆట కట్టించడానికి సూపర్ సోల్జర్ గా అర్జున్ రంగంలోకి దూకి ఏం చేశాడన్నది మిగతా కథ…

ఎలావుంది కథ

భారతీయ వెండి తెర మీద సూపర్ సోల్జర్ కాన్సెప్ట్ సరి కొత్తదే. హాలీవుడ్ తెర మీద పాతది. అయినా ఆలస్యంగా నైనా దేశవాళీ తెరపైకి తెచ్చినందుకు కొత్త దర్శకుడు అభినందనీయుడే. హాలీవుడ్ లో సూపర్ సోల్జర్ మూవీస్ తీయడం సర్వసాధారణమై పోయింది.

వీటిలో ప్రముఖమైనది మార్వెల్ స్టూడియోస్ ‘కెప్టెన్ అమెరికా’ (2011).

సైన్స్ ఫిక్షన్ జానర్ కి చెందిన సూపర్ సోల్జర్ కాన్సెప్ట్ నవలలకి, సినిమాలకి పరిమితమైన కాల్పనిక సాహిత్యం. ఇది వాస్తవ రూపం ధరించలేదు.

శాస్త్రవేత్తలు ఆచరణలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు వార్తలు. ‘ఎటాక్’ కథకి స్టోరీ ఐడియా జాన్ అబ్రహాం. సూపర్ సోల్జర్ ఐడియా బాక్సాఫీసుకి కొత్త బిజినెస్ సోర్సే. ఐతే దీనికి చేసిన కథతోనే సమస్య. కాశ్మీర్ లో తప్ప దేశంలో ఇప్పుడు టెర్రరిజం లేదనేది తెలిసిందే.

టెర్రరిజంతో సినిమాలు తీయడం కూడా మానేశారు. ఇప్పుడు ‘ఎటాక్’ తీసినప్పుడు కాశ్మీర్నే తీసుకుని అక్కడెందుకు సూపర్ సోల్జర్ తో ప్రక్షాళనా కార్యక్రమం చేపట్టకూడదన్నది వెంటనే తట్టే ప్రశ్న.

ఇక కథకి ఏవైతే మూడు మూల స్తంభాలుగా వున్నాయో అవే అసందర్భంగా వున్నాయి. 1. 2010 లో అర్జున్ టెర్రరిస్టు రెహమాన్ గుల్ ని పట్టుకుని, అక్కడే ఆత్మాహుతి దాడికి సిద్ధపడ్డ కొడుకు హమీద్ గుల్ బాంబుని నిర్వీర్యం చేసి, వెళ్ళిపొమ్మంటూ వాణ్ని వదిలేశాడు.

ఎందుకలా? వాడు టీనేజరైనా సరే వాణ్ని కూడా పట్టుకుని తండ్రితో బాటే జైల్లో వేయాలి కదా? ఇలా చేయలేదు.ఇలా చేస్తే కథ వుండదు. పెద్దవాడై హమీద్ గుల్ తిరిగి వచ్చి దాడులు చేసే అవకాశం వుండదు.

దాడిలో అర్జున్ ప్రేయసిని చంపి, అర్జున్ ని ఇన్ వాలిడ్ చేసే అవకాశముండదు.

తర్వాత పార్లమెంట్ మీద దాడి కూడా చేయలేడు. ఇవన్నీ జరగడానికి ఆనాడు టీనేజర్ హమీద్ గుల్ ని అర్జున్ వదిలేసేలా చేశాడు దర్శకుడు.

దర్శకుడు ధర్మకర్త అయితే ఇలాటివెన్నో చేయవచ్చు కథ కోసం ఉదారంగా.దర్శకుడు కార్యకర్త అయితేనే కథ కోసం కాక పాత్ర కోసం చేస్తాడు నిర్ధాక్షిణ్యంగా.

పాత్ర కోసం చేస్తే కథ కోసం చేసినట్టే. అర్జున్ పాత్రతో ఇలా చేయించడం వల్ల ఎలాటి అర్ధం వస్తోందంటే- హమీద్ గుల్ అర్జున్ ప్రేయసినీ చంపడానికీ, అర్జున్ ఇన్ వాలిడ్ అవడానికీ, చివరికి హమీద్ గుల్ పార్లమెంట్ మీద దాడి చేయడానికీ అర్జునే కారణమన్న అర్ధం వస్తోంది.

అర్జున్ ని కోర్ట్ మార్షల్ చేసి శిక్షించాల్సిన పరిస్థితి! ఇదంతా ప్రేక్షకులేం ఆలోచిస్తారులే అనుకుంటే ….

2. కొడుకు హమీద్ గుల్ కేవలం తండ్రిని విడిపించడానికి పార్లమెంటు మీద దాడి చేసి, ప్రధాని సహా 300 మంది ఎంపీల్ని బందీలుగా పట్టుకుంటాడు.

అవసరమా? దేశం నడిబొడ్డున ఇంత పనికి పాల్పడి పద్మవ్యూహంలో ఇరుక్కుని చావడం అవసరమా? ఓ విమానాన్ని హైజాక్ చేసుకుని తీసికెళ్ళి తమ భూభాగంలో కూర్చుని సురక్షిత బేరసారాలు చేసుకోవచ్చు.

ఇలా చేస్తే దర్శకుడి కథలో పార్లమెంట్ వుండదు.అందుకని పార్లమెంట్ తో బిగ్ ఈవెంట్ కోసం హమీద్ గుల్ పాత్రని కూడా కిల్ చేశాడు.

1999 లో కాందహార్ హైజాక్ జరిగిందే కదా, మళ్ళీ అలాటిదే చూపించడ మెందుకంటే, 2001 లో పార్లమెంటు మీద దాడి కూడా జరిగిందే కదా, మళ్ళీ చూపించడ మెందుకు? అందుకని కాశ్మీర్ కి పరిమితమైన టెర్రరిజం మీద తాజా కథ చేసుకోకుండా, పాత సంఘటనల టెంప్లెట్ కథ చేసుకోవడంతో ఈ హై కాన్సెప్ట్ మూవీకి ‘లో- కాన్సెప్ట్’ డీలా కథగా తేలింది.

3. పార్లమెంటు మీద దాడి చేసిన కేవలం ఓ పదిమంది టెర్రరిస్టుల్ని చంపడానికి సూపర్ సోల్జర్ అంత భారీ బిల్డప్ అవసరమా? సాధారణ పాత్రగానే జాన్ అబ్రహాం తన ఉక్కు దిమ్మెల్లాంటి హస్తాలతో నాల్గు బాదుళ్ళు బాది హరీ మన్పించగలడు.

పరిస్థితి డిమాండ్ చేయని, అవసరానికి మించి సూపర్ సోల్జర్ హంగామా అవసరమా? ఇలా కథకి మూలస్తంభాలుగా వున్న మూడు అసందర్భాలు దేశంలో ప్రప్రథమ సూపర్ సోల్జర్ హై కాన్సెప్ట్ కథని హాస్యాస్పదం చేశాయి.

ఇక ఈ టెర్రరిజం సమస్యని తెరపైకి తెచ్చి చేకూర్చిన కథా ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఎందుకంటే దేశంలో వివిధ నగరాల్లో 2013 తర్వాత నుంచి పాక్ ప్రేరేపిత టెర్రర్ దాడుల్లేవు, కాశ్మీర్లో తప్ప.

పోతే ఆధునిక సైన్స్ తో సూపర్ సోల్జర్ లాంటి సైబోర్గ్ ని సృష్టించినప్పుడు దీనికి యాంటీగా, మామూలు టెర్రరిస్టు క్యారక్టర్ ని వాడేస్తే ఈక్వెషన్ కుదరదు.విలన్ గా టెర్రరిస్టు పాత్రలో బ్రిటన్ – ఆఫ్ఘన్ నటుడు ఎల్హమ్ ఎహ్సాస్ సైజు సరిపోని పొట్టి నటుడు.రాంగ్ సెలెక్షన్.

ఈ పొట్టి వాణ్ణి చంపడానికి మహా సైబోర్గ్ లాంటి సూపర్ సోల్జర్ అవసరం లేదు.

ఎలాటి హీరోకి అలాటి విలన్ వుండాల్సిందే. టెర్రరిజం ప్రజల్ని భయపెట్టే ఒక భూతం అనుకుంటే- ఆ భూతాన్ని తలపించే అసుర మహాకాయుడ్ని చూపించాల్సిందే.

ఇక్కడ ఆధునిక సైన్సు కాన్సెప్ట్.

ఆధునిక సైన్సుకీ, రాతి యుగంనాటి టెర్రరిజపు మైండ్ సెట్ కీ పోరాటమనేలా, విస్తృతార్ధంలో సూపర్ సోల్జర్ వర్సెస్ అసుర మహాకాయుడు అన్పించేలా పాత్రల్ని తీర్చిదిద్దితేనే కాన్సెప్ట్ ప్రకాశిస్తుంది. బాక్సాఫీసు వైబ్రేషన్స్ హై ఫ్రీక్వెన్సీలో వుంటాయి.

నటనలు – సాంకేతికాలు 

గత దేశభక్తి మూవీ ‘సత్యమేవ జయతే’ లోలాంటి లౌడ్ మాస్ క్యారక్టర్ మళ్ళీ జాన్ అబ్రహాం చేయకపోవడం ఊరట.జనాలకి దేశం గురించి లేదు,ధరల గురించీ లేదు.

ఇంకా దేశం కోసం మాస్ సినిమా అరుపులు, పెడ బొబ్బలు లేకుండా, సైన్స్ ఫిక్షన్ జానర్ మర్యాదని మన్నిస్తూ ప్రొఫెషనల్ సైనికుడి పాత్ర అన్పించాడు.

దేనికీ వ్యతిరేకంగా నినాదాలు లేవు, టెర్రరిజం మీద కూడా డైలాగుల్లేవు. ఒక్క చోట మాత్రం, ‘మొహం పగిలేలా జవాబు చెప్పడం కాదు, మొహమే పగుల గొట్టేస్తాం’ అన్న పంచ్ లైన్ వుంది.

ఒక ఫిలాసఫికల్ డైలాగు – ‘జీవితంలో రెండే రోజులు చాలా ముఖ్యమైన రోజులు. మనం పుట్టిన రోజు, మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు’

ఐతే జాన్ అబ్రహాం పాత్ర తానెందుకు పుట్టిందో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు బద్ధకిస్తూ వుంటుంది. ఇంత లేజీ పాత్ర సినిమాల్లో చూడలేదు. 1999 లో అక్షయ్ కుమార్ నటించిన ‘జాన్వర్’ (పశువు) విడుదలైంది.

ఇందులో అక్షయ్ కుమార్ ఏమీ చేయని పశువులా, పరమ లేజీ పాత్రగా ఏడుస్తూ వుంటుంది.ఇది గుర్తొచ్చేలా జాన్ అబ్రహాం పాత్ర వుంది.

ఎందుకో పుట్టాంలే, ఐతే ఏంటట- అన్నట్టు ప్రవరిస్తుంది. కనీసం తాను సూపర్ సోల్జర్ అని కూడా ఫీలవదు.వొంట్లో వున్న చిప్ గుర్తుకు రాదు. జాన్ అబ్రహాం ఒకపక్క పార్లమెంట్ మీద ఎటాక్ జరుగుతూంటే, అంత సూపర్ సోల్జర్ హోదాకి వెహికిల్ లేనట్టు,హెలీకాప్టర్ దొరకనట్టు, మైళ్ళకి మైళ్ళు పరుగెత్తుకుంటూ వస్తూంటాడు.

అంతసేపు అతను పరుగెత్తుకు రావడం దర్శకుడికి చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ పార్లమెంటులో టెర్రరిస్టు దాడి సీన్లు పూర్తి చేయాలి,ఎంపీల్ని నిర్బంధించాలి, ప్రధానిని కూడా పట్టుకుని బంధించాలి… ఈ కార్యక్రమాలన్నీ వున్నాయి.

అందుకని జాన్ అబ్రహాం రోడ్డు మీద పోతున్న ఏ వెహికిల్ నీ ఆపి లాక్కోకుండా (ఏ సినిమాలోనైనా ఇలాంటప్పుడు చిప్ లేని హీరో కూడా ఈ పనే చేస్తాడు), దర్శకుడి ఆర్డర్స్ తుచ తప్పకుండా పాటిస్తూ పరుగెత్తుకుంటూ పరుగెత్తుకుంటూ వచ్చి, దాడి జరుగుతున్న పార్లమెంట్ భవనం ముందు ప్రకాష్ రాజ్ తో కలిసి నిలబడిపోయి, చూస్తూ వుంటాడు.

ఏమిటి ఇంకా చూసేదీ? లోపలింకా దర్శకుడు పూర్తి చేయాల్సిన సీన్లు పూర్తి కాలేదు. లోపలే కాదు, బయటకూడా భద్రతా దళాల్ని టెర్రరిస్టులు చంపుతున్నా నిలబడి చూస్తూనే వుంటాడు.

ఎందుకు పుట్టాడో ఇంకా తెలుసుకోడు. తను ఏఐ సహిత సూపర్ సోల్జర్ అన్న స్పృహే లేదు. చిప్ ఏమైందో తెలీదు.

‘టర్మినేటర్’ లో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ లా, కిల్లింగ్ మెషీన్ లా మారిపోయి ఎదురొచ్చిన ప్రతి ఒక్కర్నీ నేలమట్టం చేసేస్తూ తక్షణం, భారీ యాక్షన్ సీన్ని బ్లాస్ట్ చేయకుండా, ఈ ఇంటర్వెల్ సీనుని నీరు గార్చేశాడు.

తను ఇంకా బయటే నిలబడి చూస్తూ వుంటాడు, లోపల ప్రధానిని ఓ గదిలోకి నెట్టేయడంతో ఇంటర్వెల్!

ఫస్టాఫ్ ఓపెనింగ్ లో టెర్రరిస్టుల శిబిరం మీద ఎటాక్ తర్వాత, సూపర్ సోల్జర్ గా మారేక ఎప్పుడు యాక్షన్లోకి దిగుతాడా అని ఎదురు చూస్తూంటే, ఇంటర్వెల్లో కూడా నిమ్మకు నీరెత్తినట్టు వుంటే ఏమనాలి.

ఈ దర్శకుడికి బోయపాటి సినిమాలు చూపించాల్సిన అవసరముందేమో. జాన్ అబ్రహాం బోయపాటితో తీసి వుంటే బాక్సాఫీసు బద్దలయ్యేది.

అబ్రహాం సూపర్ సోల్జర్ పాత్ర సెకండాఫ్ లో కూడా క్లయిమాక్స్ మొదలయ్యేవరకూ యాక్షన్లోకి దిగదు! మరెందుకీ సూపర్ సోల్జర్ అంటూ ‘జాన్వర్’ సినిమా తీశారో తెలీదు.

సూపర్ సోల్జర్ ని రూపకల్పన చేసి, అమలుపర్చే డాక్టర్ సబాగా రకుల్ ప్రీత్ సింగ్ గ్రేస్ ఫుల్ గా నటించింది. అబ్రహాం కంటే తను ఎక్కువ యాక్టివ్ గా వుంటుంది. అబ్రహాం ప్రేయసిగా జాక్విలిన్ ఫెర్నాండెజ్ వెంటనే చనిపోయే పాత్ర.

మెట్ల మీద తూలి పడిపోతూంటే, జాన్ అబ్రహాం ముందుకు లాగి పట్టుకోవడంతో, లిప్ లాక్ అయిపోయి లవ్ ట్రాక్ స్టార్ట్ చేసుకుంటుంది. ‘రాధేశ్యామ్’ లో ప్రభాస్- పూజా హెగ్డే అంతసేపు రైలుకి వేలాడినా అధరాలు మధువుని గ్రోలలేదు.

రక్షణ శాఖ అధికారిగా ప్రకాష్ రాజ్, హోమ్ మంత్రి గా రంజిత్ కపూర్ పకడ్బందీగానే నటించారు, అయితే పార్లమెంటు మీద దాడి నేపథ్యంలో వీళ్ళ అభిప్రాయబేధాలతో కూడిన డ్రామా మెయిన్ యాక్షన్ కి అడ్డుపడుతూంటుంది.

ఈ డ్రామా బదులు పార్లమెంటులో వుండాల్సిన అసలు డ్రామా వుంటే యాక్షన్ కి తోడయ్యేది. ఇదేమిటో తర్వాత చూద్దాం. ఇక విలన్ గా టెర్రరిస్టు పాత్రలో ఎల్హమ్ ఎహ్సాస్ గురించి పైన చెప్పుకున్నాం.

ముగ్గురు ఛాయాగ్రాహకుల ఛాయాగ్రహణం, ఇతర సాంకేతిక నిపుణుల సీజీ, సెటింగ్స్, లొకేషన్స్, సంగీతం వగైరా క్వాలిటీతోనే వున్నా, యాక్షన్ కొరియో గ్రఫీ జాన్ అబ్రహాం మీద చిప్ వున్న సూపర్ సోల్జర్ అన్పించేలా లేదు.

కథలో అవసరం లేని సూపర్ సోల్జర్ ఎలాగో, యాక్షన్లో సూపర్ సోల్జర్ అన్పించని విధంగా వుంది .

-సికిందర్