దర్శకుడిగా మారబోతున్న యంగ్ హీరో.?

పూర్వాశ్రమంలో దర్శకత్వంపై పెద్దగా ప్రతిభ, అవగాహన ఏమీ లేకపోయినా.. అన్నీ నేర్చేసుకున్నాడట ఓ యంగ్ హీరో.. తాను సినిమాల్లో నటిస్తుండగానే. ఇకనేం, దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టేయొచ్చు కదా.?

ఆ ముచ్చటా త్వరలోనే తీర్చేసుకోబోతున్నాడట. ఓ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడట. కథ రెడీగానే వుందట. స్వీయ నిర్మాణంలోనే సినిమా తెరకెక్కిస్తాడట. పైగా భారీ బడ్జెట్ కూడానట.

ఇలా ఆ యంగ్ హీరో గురించి, అతని కొత్త సినిమా విడుదలకు ముందు పెద్దయెత్తున ప్రచారం జరిగింది. కాదు కాదు, ఆ హీరోనే ప్రచారం చేసుకున్నాడలా.

కానీ, సినిమా వచ్చేసింది.. ఫ్లాపయి కూర్చుంది. దాంతో, ‘అబ్బే, నాకేం సంబంధం లేదు’ అంటున్నాడట ఆ సినిమా ఫెయిల్యూర్ విషయంలో. ‘వేలు పెట్టి కెలికేయడంతోనే’ ఆ సినిమా ఔట్ అయ్యిందన్నది అంతటా వినిపిస్తోన్న వాదన.

ఇంతకీ, దర్శకత్వం చేయబోయే సినిమా ఎప్పుడు.? అంటే, అది ప్రస్తుతానికి కాస్త వాయిదా పడిందట. నేల విడిచి సాము చేయడం మానేస్తే.. ఆ యంగ్ హీరోకి మంచి మార్కెట్ వుంటుంది. కానీ, తగ్గేదే లేదంటున్నాడు మనోడు.!