సినీ రచయిత రామకృష్ణ కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ రచయిత శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ ఆరోగ్య క్షీణించడంతో సోమవారం రాత్రి 8 గంటలకు తేనాపేటలోని అపోలో హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. 50 ఏళ్ల కిందట చెన్నైలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్‌ ఉన్నారు.

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు తెలుగు డబ్బింగ్‌ చెప్పే గాయకుడు మనోను ఆయనకు పరిచయం చేసింది శ్రీరామకృష్ణే. 300 చిత్రాలకు పైగా డబ్బింగ్‌ రచయితగా పనిచేశారు. గతంలో బొంబాయి, జెంటిల్‌మెన్‌, చంద్రముఖి తదితర 300 చిత్రాలకు పైగా అనువాద రచయితగా పనిచేసిన శ్రీ రామకృష్ణ బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

దర్శకులు మణిరత్నం, శంకర్‌ అన్ని చిత్రాలకు మాటలు రాసిన శ్రీరామకృష్ణ, రజనీకాంత్‌ ‘దర్బార్‌’ చిత్రానికి చివరిగా మాటలు అందించారు. ఆయన పార్థివ దేహానికి మంగళవారం ఉదయం సాలిగ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.