సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆయన సినీ ప్రయాణం గురించి పొరుగు భాషలు సైతం ఆసక్తిని వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో మరిన్ని కొత్త నేపథ్యాల్ని, కొత్త రకమైన పాత్రల్ని స్పృశిస్తూ సినిమాలు చేయడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో… స్పై థ్రిల్లర్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతోంది. గురువారం తన పుట్టినరోజుని ఈ సినిమా సెట్లోనే జరుపుకోనున్నారు విజయ్. ఈ సినిమా తర్వాత ఆయన చేయనున్న రెండు సినిమాలు ఇప్పటికే ఖరారయ్యాయి. రవికిరణ్ కోలా దర్శకత్వంలో… గ్రావిూణ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ డ్రామా కథలో నటించనున్నారు విజయ్. దిల్‌రాజు నిర్మాత.
దీంతోపాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో… రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా ఓ సినిమా చేయనున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఓ స్పై థ్రిల్లర్, ఓ పీరియాడిక్ కథ, గ్రావిూణ నేపథ్యంలో సాగే మరో చిత్రం… ఇలా విభిన్నమైన కథలతో సరికొత్త ప్రయాణం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. తొలిచిత్రంతోనే విజయాన్ని అందుకొన్న రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.
తాజాగా మూవీ యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ‘కత్తినేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..’ అంటూ రక్తంతో తడిచిన చేయి ఉన్న పోస్టర్‌ను పంచుకుంది. ఈ డైలాగుతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయన్నట్లు తెలుపుతూ 5 భాషల్లో పోస్టర్‌ను విడుదల చేశారు. రూరల్ యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కనుంది. ‘టాక్సీవాలా’ , ‘శ్యామ్ సింగరాయ్’తో మెప్పించిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ ఓ సినిమా నిర్మిస్తోంది. వర్కింగ్ టైటిల్‌తో ఓ వీరుడి విగ్రహం ఉన్న పోస్టర్‌ను పంచుకుంటూ ఈ సినిమాను వెల్ల డించారు. 1854 నుంచి 1873 మధ్య సాగిన కథగా అర్థమవుతోంది.