సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న విదాముయార్చి .. గేమ్ చేంజర్ కి కలిసొస్తుందంటున్న ఫ్యాన్స్!

సంక్రాంతి పండుగ వ‌చ్చింది అంటే చాలు సినిమాల హ‌డావుడీ ఉంటుంది. పండుగ‌కు స్టార్ హీరోల‌ సినిమాలు విడుద‌లైతే అభిమానుల ఆనందం రెట్టింపు అవుతుంది. తెలుగులో ఈ ఏడాది సంక్రాంతికి రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ‘గేమ్ ఛేంజ‌ర్’, బాల‌య్య న‌టించిన ‘డాకు మహారాజ్‌’, విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ చిత్రాలు విడుద‌ల అవుతున్నాయి. ఇక‌ త‌మిళ స్టార్ హీరో అజిత్ ‘విదాముయార్చి’ విడుద‌ల కావాల్సి ఉంది. అయితే హీరో అజిత్ గతేడాది వెండితెరపై కనిపించలేదు. తెగింపు సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ హీరో.

ప్రస్తుతం ఆయన నటిస్తోన్న లేటేస్ట్ మూవీ విదాముయార్చి. డైరెక్టర్ మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. అర్జున్, రెజీనా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేమంటూ చిత్రయూనిట్ షాకిచ్చింది.

విదాముయార్చి సినిమాను కొన్ని అనుకోని కారణాల వల్ల సంక్రాంతికి విడుదల చేయలేకపోతున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం” అంటూ నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది. దీంతో అజిత్ అభిమానులు తీవ్ర నిరాశ పడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి త‌మిళంలో రానున్న ఒకే ఒక పెద్ద సినిమా ఇదే. ఈ చిత్రం వాయిదా ప‌డ‌డంతో ఈ పండుగ‌కు అక్క‌డ పెద్ద సినిమా లేన‌ట్లే. అయితే.. ఇది గేమ్‌ఛేంజ‌ర్ మూవీకి క‌లిసి వ‌చ్చే ఛాన్స్ ఉంది.

గేమ్ ఛేంజ‌ర్ మూవీ తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళ స్టార్ న‌టుడు ఎస్‌జే సూర్య కీల‌క పాత్ర‌ను పోషించడంతో ఈ చిత్రానికి అక్క‌డ మంచి బ‌జ్ నెల‌కొంది. అయితే విదాముయార్చి సినిమా విడుదల తేదీ పక్కాగా తెలియదు కానీ జనవరి ఆఖరి వారంలో విడుదల చేస్తారని సినీ వర్గాల సమాచారం.