డానియల్ బాలాజి ఇకలేరు !

‘టక్ జగదీష్’ సినిమాలో వీరేంద్ర నాయుడు పాత్రలో అచ్చమ్ పల్లెటూరు విలన్ పాత్రను పోషించి మెప్పించిన డానియల్ బాలాజి గుండెపోటుతో కనుమూశారు. ఆయన వయసు 48. శుక్రవారం రాత్రి చెన్నై లోని తన ఇంట్లో తీవ్రమైన గుండెపోటుకు గురి కాగా, ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయారు. బాలాజి మంచి విలక్షణ నటుడు!

తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోగా నటించిన మురళికి అతను కజిన్! చితి తమిళ్ టీవీ సీరియల్ తో 24 సంవత్సరాల క్రితం నటుడుగా ప్రవేశించాడు. ఆ తరువాత ఇంకో సీరియల్ చేస్తుండగా తమిళ్ సినిమా అవకాశం వచ్చింది. చితిలో ఫేమ్ అయిన డానియల్ పాత్ర పేరుతో సినిమా రంగంలోకి ప్రవేశించి డానియల్ బాలాజి గా స్థిరపడ్డారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళి సినిమాలు 60 వరకు చేశారు. హీరోగా మొదలైన ప్రస్థానం విలక్షణ విలన్ గా కొనసాగుతూ వచ్చారు. సెట్స్ పై మరో మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

సినిమా దర్శకుడు కావాలనే లక్ష్యం తో చెన్నై తారామతి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్సులో శిక్షణ పొందాడు! వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడని టీవీ సీరియల్స్ చేశాడు. హీరో గా, సహ ప్రతినాయకుడిగా, మెయిన్ విలన్ గా రాణిస్తూ వచ్చాడు! అతని హెయిర్ స్టయిల్, అతని డిక్షన్, అతని లుక్, ప్రత్యేకంగా అతని నటన వైవిధ్యంగా ఉండటంతో అవకాశాలు బాగానే వచ్చాయి. తెలుగులో 2004లో సాంబ సినిమాతో పరిచయమయ్యాడు. ఘర్షణ లో శ్రీకాంత్ పాత్ర అతనికి మంచి పేరును తెచ్చిపెట్టింది. అలాగే చిరుత, సాహసం శ్వాసగా సాగిపో, సూర్యాస్తమయం తదితర సినిమాల్లో గుర్తింపు కలిగిన పాత్రలను పోషించి తెలుగు సినిమాల మార్కెట్ ను తమిళనాడులో పెంచగలిగాడు!

చూడటానికి విలన్ లా కనిపించినా మంచి మృదు స్వభావి. తక్కువ మాట్లాడతారు. మంచి సినిమాకు దర్శకత్వం వహించాలని, భారతిరాజాలా భిన్నమైన సినిమాలు తీయాలనే లక్ష్యంతో ఉన్నట్లు బాలాజి స్నేహితుడు రమేష్ తెలిపారు. అతనికి జాతకాల పిచ్చి. సంఖ్య శాస్త్రం పై అపార నమ్మకం! అతనికి వివాహం చేయాలని తల్లి ఎంతగా ప్రయత్నించినా జాతకాలు కుదరక చాలా సంబంధాలు వదిలేసినట్లు తెలిసింది. తన జాతకంలో బ్రహ్మచారిగా రాసిపెట్టి ఉందని పెళ్ళి చేసుకోను అని చెప్పినట్లు సమాచారం. సినిమాల్లో సంపాదించిన డబ్బు తో కొట్టివాక్కంలో ఒక అద్భుత ఆలయం నిర్మిస్తున్నారు. అది 80 శాతం పూర్తి అయ్యింది! మంచి నటుడు బాలాజి భవిష్యత్ లో మంచి దర్శకుడు అనిపించుకోవాలనే కోరిక పూర్తి కాకుండానే చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు! మంచి నటుడ్ని కోల్పోయాం. అశ్రు నివాళి.