TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై గంటలు తరబడి క్యూ లైన్ లో ఉండాల్సిన పని లేదు..!

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి శ్రీవారి సన్నిధికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఏడాది పొడవునా నిరంతరం భక్తులతో నిండిపోయే తిరుమలలో, దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండడం సాధారణమే. అయితే ఇప్పుడు ఈ కష్టాలు తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.

భక్తుల సమయాన్ని ఆదా చేసి, మరింత క్రమబద్ధంగా దర్శనం జరగాలన్న లక్ష్యంతో టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించింది. ఇందుకు భాగంగా, క్యూఆర్ కోడ్, ఫేషియల్ రికగ్నిషన్ విధానాలను అమలు చేయనుంది. భక్తులు తిరుమలలో ప్రవేశించిన వెంటనే వీటి ద్వారా ధృవీకరణ ప్రక్రియ వేగవంతం అవుతుంది.

ఇక భక్తులు సమయానికి ఆలయ ప్రాంగణంలో చేరుకోవడం నిర్బంధం కాబట్టి, దర్శనానికి ఆలస్యమయ్యే సమస్య తగ్గుతుంది. పైగా, ప్రతి ఒక్కరికి తన దర్శనానికి ఎంత సమయం పడుతుందో ముందే తెలియజేసేలా సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా క్యూలైన్‌లో క్రమం, భద్రత, అవగాహన మరింత పెరుగుతుందని టీటీడీ ఆశిస్తోంది.

ఈ టెక్నాలజీ అమలుతో భక్తుల రద్దీని సమర్ధంగా నియంత్రించి, దర్శనం తక్కువ సమయంలో పూర్తి చేయాలన్నది ప్రధాన లక్ష్యం. దర్శనాల ప్రక్రియపై పర్యవేక్షణ కూడా బలపడి, ఎక్కడ ఆలస్యాలు జరుగుతున్నాయో గుర్తించి తక్షణమే పరిష్కారం చూపిస్తామని అధికారులు చెప్పారు. అన్ని చర్యలు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని జరుగుతున్నాయని స్పష్టంచేశారు. తీర్థయాత్రలకు కొత్త టెక్నాలజీ జతకావడంతో, భక్తులు మరింత సౌకర్యంగా శ్రీవారి కృప పొందగలుగుతారని ఆశిద్దాం.