రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడి వార్తల్లో నిలిచిన రజత్ కుమార్ జీవితంలో అనూహ్యంగా విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో ఫిబ్రవరి 9న రజత్ తన ప్రియురాలు మను కశ్యప్‌తో కలిసి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబాలు వారి ప్రేమకు అంగీకారం చెప్పకపోవడం ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో మను కశ్యప్ ఆసుపత్రిలో మృతిచెందగా, రజత్ పరిస్థితి విషమంగా ఉంది.
ప్రస్తుతం రజత్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. కులాలు వేరు కావడంతో వారి కుటుంబాలు వివాహాన్ని అంగీకరించలేదని సమాచారం. వారి ప్రేమను అర్థం చేసుకోని కుటుంబాల నిరాకరణ వల్ల తీవ్ర మనస్తాపం చెందిన జంట ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటన స్థానికులను దిగ్బ్రాంతికి గురిచేసింది. రజత్ కుమార్ పేరు రిషభ్ పంత్ కారు ప్రమాదం సమయంలో వెలుగులోకి వచ్చింది.
2022లో రూర్కీ సమీపంలో పంత్ కారుకు మంటలు అంటుకున్నప్పుడు రజత్ తో పాటు అతని సన్నిహితుడు నిషు కుమార్ ఇద్దరూ పంత్‌ను వాహనంలో నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆ కృతజ్ఞతగా పంత్ వారిద్దరికి స్కూటర్లను బహుమతిగా ఇచ్చాడు. రజత్ అప్పుడు జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు రజత్ జీవితంలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. ఒకప్పుడు ప్రాణం కాపాడిన రజత్, ఇప్పుడు తన ప్రాణం కోసం పోరాడుతున్నాడు. ఈ ఘటన ప్రేమ, కుల వివక్షలపై చర్చలకు దారి తీస్తోంది.