Jani Master: పరిశ్రమలో మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నాం.. జానీపై ఫిర్యాదు చేసిన మహిళపై గోప్యత

టాలీవుడ్ కొరియెగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపు కేసు నమోదైన క్రమంలో తాజాగా జానీ మాస్టర్‌ వివాదంపై టాలీవుడ్‌ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. తమ్మారెడ్డి భరద్వాజ్‌, కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, జాన్సీ తదితరులు ఈ కార్యకమంలో పాల్గొన్నారు.

జాన్సీ మాట్లాడుతూ: బాధితురాలు మొదట విూడియాను ఆశ్రయించింది. విూడియా ఈ ఘటనను మా దృష్టికి తీసుకొచ్చింది. పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత ఆ అమ్మాయి ఛాంబర్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. దీనిపై లీగల్‌గా విచారణ జరుగుతోంది. అప్పటి దాకా కాస్త సంయమనం పాటించాలి. ప్రభుత్వం తరఫు నుంచి సినిమా ఇండస్ట్రీలో మహిళల రక్షణ నిమిత్తం సరైన గైడ్‌లైన్స్‌ లేవు. శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఒక కమిటీ ఫామ్‌ అయింది. అప్పటి నుంచి భద్రత విషయంలో కట్టుదిట్టంగా ఉన్నాం. జానీ మాస్టర్‌ వివాదం రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉంది. మేమే తనను పోలీసులను కూడా ఆశ్రయించమని కోరాము. పోలీసుల విచారణ, మా విచారణ పార్లర్‌గా జరుగుతుంది. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను, జానీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశాం. 90 రోజుల లోపే దీనిపై క్లారిటీ వస్తుంది. దయచేసి బాధితురాలి ఫేస్‌ను రివీల్‌ చేయవద్దని విూడియాను కోరుతున్నాం. అవకాశాలు దక్కవనే భయంతో చాలామంది తమకు ఎదురైన పరిస్థితులను చెప్పడం లేదు. ప్రతిభ ఉన్నవారికి ఇండస్ట్రీలో తప్పకుండా అవకాశాలు దక్కుతాయని అన్నారు.

దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ:  ‘జానీ మాస్టర్‌ విూద ఆరోపణలు రాగానే వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఆదేశించామని అన్నారు.

90 రోజుల్లో జానీ మాస్టర్‌ కేసు పరిష్కారం అవుతుంది. ఇలాంటి విషయాలను పరిష్కరించడానికి ఛాంబర్‌ తరపున ప్రతి యూనియన్‌కు ఓ కంప్లైంట్‌ కమిటీ పెట్టుకోవాలని సూచించనున్నాము. డాన్సర్‌ యూనియన్‌ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నామని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.