తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు మూతపడతాయంటూ వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమావేశంలో ఈ విషయాన్ని ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం బంద్‌కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అలాంటి పుకార్లు పరిశ్రమను దెబ్బతీసేలా చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు స్పష్టత రాకపోయినా, దాని కోసం మూడు విభాగాల నుంచి ప్రతినిధులతో కమిటీని వేయాలని నిర్ణయించామని దామోదర తెలిపారు. ఈ నెల 30న జరిగే సమావేశంలో ఆ కమిటీలోని సభ్యుల్ని ఖరారు చేస్తామని చెప్పారు. సమస్యలు ఉన్నాయి కానీ, వాటిని నెమ్మదిగా పరిష్కరించాలే తప్ప, బంద్ చేయాలని ఎక్కడా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
ముఖ్యంగా ఒక సినిమాకు కేంద్రంగా తీసుకుని థియేటర్ల బంద్ అనడం పూర్తిగా తప్పు అని దామోదర స్పష్టం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే అధికారికంగా సమాచారం ఇస్తుందని, ఎవరో మాట్లాడిన మాటలతో వదంతులు వ్యాపించకుండా చూడాలని మీడియాను కోరారు. అవసరమైతే త్వరలో అన్ని విభాగాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిస్తామని, అవసరమైతే ప్రభుత్వంతోనూ మంతనాలు జరుపుతామని తెలిపారు. థియేటర్లు యథాతథంగా నడుస్తాయని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు.