బిగ్ బాస్ 4: అఖిల్, మోనాల్‌కి మ‌ధ్య అడ్డుగా మారిన అద్ధం.. గంగ‌వ్వ రీఎంట్రీతో జోష్‌లో ఫైన‌లిస్ట్స్

సీజ‌న్ 4 తుదిద‌శ‌కు చేరుకోవ‌డంతో హౌజ్‌మేట్స్‌తో పాటు ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు కొత్త ప్లాన్స్ వేస్తున్నాడు బిగ్ బాస్ . ఫినాలేకు రెండు రోజులు మాత్ర‌మే స‌మ‌యం మిగిలి ఉన్న నేప‌థ్యంలో ఇంటి నుండి ఎలిమినేట్ అయిన హౌజ్‌మేట్స్ అందరిని తిరిగి హౌజ్‌లోకి ప్ర‌వేశ‌పెట్టారు. రీయూనియ‌న్ పేరుతో స‌ర‌దా ఫ‌న్ అందించేందుకు బిగ్ బాస్ ప‌క్కా ప్రణాళిక‌లు ర‌చించారు. క‌రోనా లేక‌పోతే ఈ రోజు హౌజ్‌లో సంద‌డి ఓ రేంజ్‌లో ఉండేది. కాని క‌రోనా వ‌ల‌న మ‌ళ్ళీ గ్లాస్ రూం ఏర్పాటు చేసి అందులో నుండే ఫైన‌లిస్ట్స్‌తో మాట్లాడే అవ‌కాశం క‌ల్పించారు బిగ్ బాస్.

14 వారాల్లో ఎలిమినేట్ అయిన 14 మంది కంటెస్టెంట్స్ ఈ రోజు రేపు బిగ్ బాస్ హౌజ్‌లో సంద‌డి చేయ‌నున్నారు. సత్యం సినిమా దర్శకుడు సూర్య కిరణ్,కరాటే కళ్యాణి , అవినాష్, లాస్య, గంగవ్వ, దివి, నోయల్, సుజాత, మెహబూబ్, మోనాల్, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ ఇలా ఎలిమినేట్ అయిన హౌజ్‌మేట్స్ అంద‌రు ఫైన‌లిస్ట్‌ల‌తో క‌లిసి ఈ రెండు రోజులు ర‌చ్చ‌రచ్చ చేయ‌నున్నారు. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో మోనాల్ అంద‌రి కంటే ముందుగా ఇంట్లోకి ప్ర‌వేశించిన‌ట్టు తెలుస్తుంది.

మోనాల్‌ని చూడ‌గానే ఉరుక్కుంటూ వ‌చ్చిన అఖిల్ గ్లాస్ బ‌య‌ట నుండే ఆమెను హ‌త్తుకొని గాల్లో తేలిపోయాడు. గ్లాస్ ప‌గ‌ల‌గొడ‌తానంటూ అత్యుత్సాహం చూపించింది మోనాల్. ఇక లాస్య, కరాటే కళ్యాణి జంట‌గా వచ్చారు. లాస్య కాసేపు ఫైన‌లిస్ట్‌ల‌తో ఆట‌లాడించింది. గంగవ్వ, సుజాత, అవినాష్, నోయల్, కుమార్ సాయి అంతా వచ్చి పండగ చేసుకున్నారు. దివి, మెహబూబ్ డాన్సులు చేసుకుంటూ వచ్చారు. నోయల్ ఛిల్ అవుతూ వచ్చాడు. రెండు రోజుల పాటు సంద‌డిగా సాగ‌నున్న రీయూనియ‌న్ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.