Hero Yash: ఒకప్పుడు హేళన చేసినవారే.. ఈరోజు చప్పట్లు కొడుతున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కెజిఎఫ్ హీరో!

Hero Yash: కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో హీరో యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. మూడేళ్ల కింది వరకు ఈయన కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో. ఇప్పుడు రాఖీ భాయ్ గురించి తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో..? ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, ఇప్పుడు పార్ట్ 2 తో మరో సారి విజయ ఢంకా మోగించడానికి యశ్ సిద్దమయ్యాడు. ఇప్పుడు యశ్ అంటే కన్నడ హీరో మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు సైతం అభిమాన హీరోగా మారిపోయాడు. అంతే కాదు ఈ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో ఎవరికీ లేనంత మార్కెట్ ను సొంతం చేసుకున్నాడు ఈ స్టార్ హీరో.

అయితే కేజీఎఫ్ మూవీలో ఎలా ఐతే తన తల్లికి ఇచ్చిన మాట కోసం మహారాజుగా ఎదిగి ఈ ప్రపంచాన్ని ఏలే వ్యక్తిగా మారాడో, అలానే తన నిత్య జీవితంలో కూడా అనుకోని సంఘటనలు, సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి తాను పడ్డ శ్రమ గురించి యశ్ కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను మైసూర్ లోనే పుట్టి పెరిగానని చెప్పారు. తండ్రి బస్ డ్రైవర్ గా పని చేసేవారని, తనకు తెలియకుండానే చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం ఉండేదని చెప్పారు. ఎలాగైనా సినిమాల్లో నటించాలని, హీరో అవ్వాలని ఎన్నో కలలు కనేవాడినని తెలిపారు. అలా నటుడుగా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఎప్పుడూ అనుకునే వాడినని చెప్పారు.

అదే ఆత్మ విశ్వాసంతో అడుగులు ముందుకు వేశానన్న యశ్, స్కూల్లో నిర్వహించే ప్రతీ ఈవెంట్ లోనూ పాల్గొని, తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు చాలా ప్రయత్నించే వాడినని చెప్పారు. పోటీల్లో గెలవక పోయినా పర్లేదు, కానీ పాల్గొనడం గొప్పగా భావించే వాడినని యశ్ అన్నారు. అలా తాను హీరో అవ్వాలన్న ఆశ రోజు రోజుకీ పెరిగిపోయిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. అది ఎంతలా అంటే చిన్న తనంలో ఎవరైనా తనను పెద్దయ్యాక ఏమవవుతావు అంటే, ఎలాంటి జంకూ లేకుండా ధైర్యంగా హీరో అవుతా అని చెప్పేవాడిని ఆయన తెలిపారు. అది విని తోటి విద్యార్థులు నవ్వుకునేవారని, ఐనా కూడా తాను ఎప్పటికైనా హీరో అయ్యి తీరుతానని తనకు తాను మనసులో అనుకునే వాడినని యశ్ అన్నారు.

కొన్ని రోజులకి స్కూల్ లో వాళ్లకు కూడా తాను హీరో అవుతాడు అన్న నమ్మకం వచ్చి, అందరూ హీరో అని పిలిచేవారని, అలా అందరూ తనను హీరో అని పిలుస్తూ ఉంటే, అప్పటికే తాను ఎంతో సాధించి నట్టుగా ఫీల్ అయ్యేవాడినని యశ్ చెప్పారు. ఆ తర్వాత నటుడిగా పేరు తెచ్చుకోవాలంటే ముందు ఏదైనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చెరాలని అందరూ చెప్పారు. కానీ తన దగ్గర అంత డబ్బు లేకపోయిందని యశ్ అన్నారు. తన తల్లదండ్రులు కూడా తాను హీరో అవుతాను అంటే వద్దు అని వాదించే వారని, అది ఇక అయ్యేలా లేదని తాను ఇంటి నుంచి వచ్చి పారిపోయానని చెప్పారు. అలా బెంగళూర్ వచ్చిన తాను బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి, హీరోగా అవకాశాల కోసం ఎదురు చూసానని యశ్ తెలిపారు. ఆ తర్వాత చాలా కష్టపడి ఈ రోజు ఇలా ప్రపంచం మెచ్చుకునే స్థాయిలో సినిమాలు చేస్తూ, అందరి మన్ననలనూ పొందుతున్నానని యశ్ వివరించారు.