సినిమాలంటే ఒకప్పుడు ప్రేక్షకులకు పండగ. కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం అందరికీ ఆనందంగా ఉండేది. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీల రాకతో సినిమా అనుభూతిని ఇంట్లోనే ఆస్వాదించడం మొదలైంది. ఈ ప్రభావం థియేటర్ల పై తీవ్రంగా పడింది. ఈలోపు టికెట్ రేట్లు పెంచడంతో ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా మరింత దూరమవుతున్నారు.
సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు ఈ విషయాన్ని మళ్లీ నిరూపించాయి. రామ్ చరణ్ నటించిన “గేమ్ చేంజర్”కి టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో, టాక్ బాగా లేకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా ఉండిపోయారు. “పుష్ప 2” విడుదల సమయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అధిక టికెట్ ధరలు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి భారం అయ్యాయి. వారు పెద్ద ఎత్తున సినిమాలను థియేటర్లలో చూడటం మానేశారు.
అదే సమయంలో “డాకు మహారాజ్”, “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలు నార్మల్ టికెట్ ధరలతో ప్రేక్షకులను ఆకర్షించాయి. ముఖ్యంగా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో విజయం సాధించింది. అందుబాటులో ఉండే టికెట్ ధరలే ఈ సినిమాల విజయానికి ప్రధాన కారణమని స్పష్టమైంది. నిర్మాతలు అధిక రేట్లు పెట్టి ప్రేక్షకులను దూరం చేయడం పట్ల మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నార్మల్ రేట్లు ఉంటేనే థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగి, మొత్తంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. టికెట్ రేట్లను మరింత సులభంగా అందుబాటులో ఉంచితే, ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు రావడం తప్పనిసరి.