Producer Shirish: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు రామ్ చరణ్ నిర్మాత శిరీష్. ఈ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడుతూ నిర్మాత శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే శిరీష్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు కోపం తెప్పించాయి. ఆయనపై మండిపడుతూ ట్రోల్స్ చేస్తూ నెగిటివ్గా కామెంట్ చేయడంతో నిర్మాత శిరీష్ స్పందిస్తూ రామ్ చరణ్ కి మొదట క్షమాపణలు తెలిపారు.
చరణ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన్ను ఎప్పుడూ కించపరిచే ఉద్దేశం లేదని అన్నారు. అయితే తాజాగా అభిమానులకు సారీ చెబుతూ ఒక లేఖను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అది చాలదు అన్నట్టు తాజాగా మరోసారి వీడియో ద్వారా వివరణ ఇచ్చారు శిరీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆ వీడియోలో శిరీష్ రెడ్డి మాట్లాడుతూ.. రామ్ చరణ్, చిరంజీవి, మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు. ఆయనతో రిలేషన్ ను పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు.
అభిమానుల బాధను నేను అర్థం చేసుకోగలను. అయితే నేను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదు. మా మధ్య ఉన్న స్నేహంతో మాట దొర్లాను. ఇతర మెగా హీరోలైన వరుణ్ తేజ్, సాయి దుర్గాతేజ్ లతోనూ మేం సినిమాలు చేశాము. చిరంజీవి గారు నాతో, దిల్ రాజుతో తరచూ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి అనుబంధం ఉన్న వారిని అవమానించేంత మూర్ఖుడిని కాదు. అభిమానులు అర్థం చేసుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని విడుదల చేయొద్దు అని ఆయన చెప్పి ఉంటే ఆ మూవీ రిలీజ్ అయ్యేదే కాదు. మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టిమా గురించి ఆలోచించారు. అలాంటిది ఆయన్ను ఎందుకు అవమానిస్తాం? ఆయనతో ఇంకో సినిమా చేయబోతున్నాము అది నా తొలి ఇంటర్వ్యూ కాబట్టి మాట దొర్లిందేమో. దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని శిరీష్ వివరణ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.